మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (17:40 IST)

అదుగో మూవీ రివ్యూ - రవిబాబు ప్రయోగం సక్సెస్ అయిందా?

నిర్మాణ సంస్థ : సురేష్ ప్రొడ‌క్ష‌న్స్
నటీనటులు : ర‌విబాబు, అభిషేక్ వ‌ర్మ‌, న‌భా, ఉద‌య్ భాస్క‌ర్, ఆర్‌.కె, వీరేంద‌ర్ చౌద‌రి త‌దిత‌రులు
క‌థ‌, నిర్మాత‌, ద‌ర్శక‌త్వం: ర‌విబాబు
చిత్రం : అదుగో
విడుదల : బుధవారం, నవంబరు 7, 2018.
 
తెలుగు చిత్ర పరిశ్రమలో రవిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడుగా తనదైన గుర్తింపు సంపాదించుకోవడమేకాకుండా ద‌ర్శ‌క నిర్మాత‌గా కూడా రాణిస్తున్నాడు. 'అల్ల‌రి, అవును, అవును 2, అన‌సూయ‌, అమ‌రావ‌తి, న‌చ్చావులే, నువ్విలా' వంటి చిత్రాలను తెరకెక్కించాడు. 
 
ఈ క్ర‌మంలో ర‌విబాబు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన చిత్రం "అదుగో". సాధార‌ణంగా ప్రేమ‌క‌థా చిత్రాలు, కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్‌, హార‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ర‌విబాబు అదుగో సినిమా కోసం ప్రయోగం చేశాడు. ఇంత‌కు ఆ ప్ర‌యోగం ఏమంటారా.. లైవ్ యానిమేష‌న్ టెక్నాల‌జీతో పందిపిల్ల‌ను ప్ర‌ధాన పాత్ర‌ధారిగా సినిమా చేయ‌డ‌మే. ఈ సినిమా కోసం దాదాపు రెండున్న‌ర సంవ‌త్స‌రాల క‌ష్ట‌ప‌డ్డాడు ర‌విబాబు. మ‌రి అదుగో సినిమా ఎలా ఉందో పరిశీలిద్ధాం. 
 
క‌థ‌: 
ఓ పంది త‌న పిల్ల‌కు క‌థ‌ను చెప్ప‌డంతో సినిమా ప్రారంభమవుతుంది. గ‌న్న‌వ‌రంలోని చంటి.. ఓ పంది పిల్ల పెంచుకుంటూ ఉంటాడు. దానికి బంటి అని పేరు పెట్టుకుంటాడు. అయితే ఓ ఇద్ద‌రు వ్య‌క్తులు ఆ పంది పిల్ల‌ను ఎత్తుకుని పారిపోతారు. చంటి వారి వెంటే బంటిని వెతుక్కుంటూ వ‌స్తుంటాడు. మ‌రో వైపు సిక్స్ ప్యాక్ శివ‌(ర‌విబాబు), బెజ‌వాడ దుర్గ మ‌ధ్య వెయ్యి ఎక‌రాల‌కు సంబంధించిన డీల్ గొడ‌వ జ‌రుగుతుంటుంది. ఇంకోవైపు గుట్కా వ్యాపారం చేసే గంగరాజుకి, అమ్మాయిల‌ను అక్ర‌మంగా షార్జాకు పంపే శంక‌ర్‌కు మ‌ధ్య ఆధిప‌త్య‌ గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. 
 
అలాగే అభిషేక్(అభిషేక్ వ‌ర్మ‌)కి ఉద్యోగం చేయ‌డం ఇష్టం ఉండ‌దు. చౌక ధ‌ర‌కు ఓ మొబైల్‌ను త‌యారు చేయాల‌నుకుంటూ ఉంటాడు. అత‌ని ప్రియురాలు రాజి(న‌భా)ను పెళ్లి చేసుకోవాల‌నుకుంటే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అయితే ఎవ‌రో కొంద‌రు రాజిని కిడ్నాప్ చేస్తారు. అస‌లు రాజిని ఎందుకు కిడ్నాప్ చేస్తారో తెలియదు. ఇలా, మూడు నాలుగు గ్యాంగులు, అభి, రాజి, చంటి, బంటిల‌కు ఉన్న సంబంధాలు ఏంటి అనే విషయాలతో సాగే చిత్రమే ఈ మూవీ. 
 
విశ్లేష‌ణ‌:
ఓ ప్రధానాంశం చుట్టూ కొన్ని గ్యాంగులు వెంట‌ప‌డ‌టం.. అదే మెయిన్ పాయింట్‌కు హీరో, హీరోయిన్‌కి లింకు ఉండ‌టం అంద‌రూ దాని వెంట‌నే ప‌రుగు పెట్ట‌డం చివ‌ర‌కు ఓ శుభం కార్డు ప‌డ‌టమే ఈ కథ. ఈ క‌థ‌నంతో తెర‌కెక్కిన సినిమాలు గతంలో అనేకం వచ్చాయి. ఇప్పుడు ర‌విబాబు కూడా ఇలాంటి థ్రిల్లింగ్ ఎంట‌ర్‌టైన‌ర్‌నే తెరకెక్కించాడు. ఆంధ్రప్ర‌దేశ్ నుంచి విడిపడి తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి దాని చుట్టూ ఉన్న ప్ర‌దేశాల్లో భూముల ధ‌ర‌లు అమాంతంగా పెరిగాయి. దాంతో చాలా మంది భూములను క‌బ్జా చేసే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి. ఇలాంటి కాన్సెప్ట్‌కు ఓ పందిపిల్ల‌కు లింక్ పెట్టి రవిబాబు క‌థ రాసుకున్నాడు. 
 
అలాగే త‌న చిత్రాల్లో చూపించే అడ‌ల్ట్ త‌ర‌హా కామెడీని ఈ సినిమాలో కూడా చొప్పించాడు. పందిపిల్ల చుట్టూనే సినిమా అంతా తిరుగుతుంది. హీరో, హీరోయిన్ కూడా అనుకోకుండా పందిపిల్ల‌కు లింక్ ప‌డి ట్రావెల్ అవుతుంటారు. సినిమా ఫ‌స్టాఫ్ ముగియ‌డానికి ముందే క్లైమాక్స్ గురించి ఓ అవ‌గాహ‌న వ‌చ్చేస్తుంది. అయితే ర‌విబాబు ఎంత ఆస‌క్తిగా తెర‌కెక్కించాడో అనేదే పాయింట్‌గా మారింది. 
 
లైవ్ యానిమేష‌న్‌లో చేసిన పందిపిల్ల విన్యాసాలు ఆక‌ట్ట‌ుకుంటాయి. ప్ర‌శాంత్ విహారి పాట‌లు ఆకట్టుకోలేక పోయాయి. నేప‌థ్య సంగీతం ఫర్వాలేదనిపించింది. సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. క‌న్‌ఫ్యూజింగ్ కామెడీతో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం పెద్ద‌గా వ‌ర్కవుట్ కాలేదు. మొత్తంమీద రవిబాబు పడిన రెండున్నరేళ్ళ శ్రమ నిష్ఫలమని చెప్పొచ్చు.