డీప్ ఫేక్ వీడియో.. మరో బాలీవుడ్ బాధితురాలు
డీప్ ఫేక్ వీడియోలను నివారించడానికి ఓవైపు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ.. మరోవైపు సినీ తారలు దీని బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రియాంక గతంలో మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖం మార్చకుండా అందులోని వాయిస్‌ను కొందరు ఆకతాయిలు మార్చారు. ఆమె ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు లిప్‌సింక్ చేశారు. ఆమె తన వార్షిక ఆదాయాన్ని వెల్లడించిన్నట్లు ఆ వీడియోను రూపొందించారు.
ఒక బ్రాండ్ కారణంగా 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ దాన్ని ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీనిపై పలువురు స్పందిస్తూ.. ఇలా చేయడం దారుణమంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఇటీవల రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అలియా భట్, కాజోల్, కత్రినా కైఫ్‌ల డీప్ ఫేక్ వీడియోలు ఆందోళన కలిగించాయి. వీటిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిని నివారించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.