గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:26 IST)

"ఆర్ఆర్ఆర్" హీరోయిన్‌కు కరోనా పాజిటివ్...

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈమె దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న విషయం తెల్సిందే. రెండు మూడు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చిన ఆమెకు.. పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది. 
 
ఈ విషయాన్ని గురువారం అర్థరాత్రి ఇస్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ఇంట్లో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నానని, వైద్యుల సలహా మేరకు అన్ని భద్రతా ప్రోటోకాల్స్‌ పాటిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అలియా సంజయ్‌ లీలా భన్సాలీ గంగుభాయ్‌ కతియావాడి చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
 
కాగా, గత నెల మొదట్లో చిత్ర డైరెక్టర్‌ భన్సాలీకి కరోనా వైరస్ సోకింది. కొద్ది రోజుల్లో వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ముంబైలోని స్టూడియోలో "గంగూభాయ్ కతియావాడి" చిత్రానికి సంబంధించిన పాటను షూట్ చేస్తున్నారు. 
 
ఈ షూట్‌లోనే అలియాభట్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్య పరీక్షలు చేయించగా.. ఆమెకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. అలియా బాయ్‌ఫ్రెండ్‌ రణబీర్‌ కపూర్‌ సైతం మార్చిలో కరోనా సోకింది. అప్పుడు సైతం అలియా కొద్ది రోజులు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంది. ఇపుడు మరోమారు అలియాకు కరోనా సోకడంతో ఆర్ఆర్ఆర్ షూటింగుకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.