భారీ ధరకు అల వైకుంఠపురములో రైట్స్.. ఆ సంస్థ దక్కించుకుందా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. బన్నీ సరసన రెండవ సారి పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. బన్నీ, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమా కావడంతో దీనిపై బన్నీ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.
సీనియర్ హీరోయిన్ టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సునీల్, రాహుల్ రామకృష్ణ, నవదీప్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, అదే కంపెనీ సీఈవోగా పూజాహెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన తండ్రి పాత్రలో మురళి శర్మ నటిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ దక్కించుకోగా, తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.