శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (11:56 IST)

ఆర్ఆర్ఆర్ ‘సీత’ వచ్చేసింది..! ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసిన చిత్రబృందం

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా కనిపించనున్నారు. ‘సీత’ పాత్రలో ఆమె మెప్పించనున్నారు. శుక్రవారం ఆలియా పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చిత్రబృందం షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ లుక్‌ ప్రతిఒక్కర్నీ ఆకర్షిస్తోంది.
 
‘‘రామరాజు రాక కోసం బలమైన సంకల్పంతో సీత వేచి చూస్తోంది. ఆమె ఎదురుచూపులు ఎంతో గొప్పవి’’ అని ఆర్ఆర్ఆర్ టీమ్ ట్వీట్ చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. చెర్రీకి జంటగా ఆలియాభట్‌, తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. 
 
దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ నటీనటులు ఇందులో భాగమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.