గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

'మంగళవారం' టీజర్ చూసిన వెంటనే సినిమా చూడాలనే కోరిక కలిగింది - ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్

mangalavaaram
యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత ఆయన తీసిన చిత్రమిది. పాయల్ రాజ్‌ పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి 'ఏ' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మతో కలిసి చిత్రాన్ని నిర్మించింది. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి సినిమాలో ప్రధాన తారాగణం. నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కాగా... శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ''ఈ 'మంగళవారం' నవంబర్ 17న విడుదల అవుతోంది. ప్రేక్షకులు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. కొన్ని రోజుల క్రితం టీజర్ చూశా. షాక్ అయ్యా. టీజర్ చూసిన వెంటనే సినిమా చూడాలనే కోరిక మనలో అతి తక్కువ సినిమాలు కలిగిస్తాయి. 'మంగళవారం' టీజర్ సినిమా చూడాలనే కోరిక కలిగించింది. అజయ్ భూపతి నాకు కథ చెప్పినప్పుడు ఏమన్నారో గుర్తు ఉంది. 'మీరు గర్వించే స్థాయిలో సినిమా తీస్తా' అని చెప్పారు. ట్రైలర్లో ఆ ఫీలింగ్ ఇచ్చారు. నాకు 'ఆర్ఎక్స్ 100' చాలా ఇష్టం. అందులో 'పిల్లా రా' సాంగ్ మా ఇంట్లో ఎప్పుడూ ప్లే అవుతుంది. ఆయన గొప్ప టెక్నీషియన్. పెద్ద దర్శకుడు అవుతాడని నాకు నమ్మకం ఉండేది.
 
రెండు రోజుల క్రితం 'పుష్ప 2' షూటింగ్ జరుగుతుంటే... సుకుమార్ గారు వచ్చి 'మంగళవారం సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వెళ్తున్నావా? అని అడిగారు. అవునని చెప్పా. అప్పుడు ఆయనకు టీజర్ చూపించా. దర్శకుడు షాక్ ఇచ్చాడని సుకుమార్ చెప్పారు. కొన్ని సినిమాలకు వైబ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాలో అటువంటి వైబ్ ఉంది. ప్రేక్షకులు అందరూ వచ్చి మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రాఫర్, సౌండ్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ చాలా బాగా వర్క్ చేశారు. 'ఆర్ఎక్స్ 100' ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఇప్పుడు హీరోయిన్ పాయల్ కు 'మంగళవారం' మైల్ స్టోన్ కావాలని కోరుకుంటున్నా. ఆమెకు ఆల్ ది బెస్ట్. చాలా బోల్డ్ విషయం ఉన్న కథ ఇది. అజయ్ భూపతి కథ చెప్పినప్పుడు ఇటువంటి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలని అనిపించింది. ఆయన బాగా డీల్ చేస్తారని అనుకున్నా. 
 
టీజర్, ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా తీశారని అనిపించింది. సినిమా అవుట్ పుట్ మీద పాజిటివ్ గా ఉన్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మనకు సక్సెస్ వస్తే వాళ్లకు వచ్చినట్లు ఎంజాయ్ చేసే ఫ్రెండ్ జీవితంలో చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఎదుగుతుంటే వాళ్ళు ఎదిగినట్లు ఫీలయ్యే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. నాకు అటువంటి స్నేహితులు స్వాతి, ప్రణవ్. వాళ్ళిద్దరూ నాకు క్లోజ్. ఇది నాకు సొంత సినిమాలాగా. మా గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా తీసినా, మా బన్నీ వాసు, ఎస్కేఎన్ సినిమా తీసినా నేను ఎలా ఫీల్ అవుతానో... ఈ సినిమాకూ అంతే! ముద్ర మీడియా వర్క్స్ సంస్థ స్థాపించి స్వాతి తీసిన తొలి సినిమా ఇది. ఇలాగే ఎన్నో మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 
 
ప్రసాద్ అంటే మాకు ఎప్పటి నుంచి రెస్పెక్ట్. మా టీవీ అప్పటి నుంచి ఆయన మాకు పార్ట్నర్. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. రెండేళ్ల క్రితం స్వాతి ఆఫీసుకు వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నట్లు చెప్పింది. ఆమెను ప్రోత్సహించడానికి నేను కొన్ని మాటలు చెప్పా. కానీ, ఏ రోజూ నన్ను ఏమీ అడగలేదు. తన సొంతంగా సినిమా తీసింది. చిత్ర నిర్మాణంలో సురేష్ వర్మ లాంటి భాగస్వామి ఆమెకు లభించడం సంతోషంగా ఉంది. ఆయన కూడా నాకు మా టీవీ రోజుల నుంచి తెలుసు. నాకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అటెండ్ అయిన ఫస్ట్ ఫంక్షన్ ఇది. నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. అందరి ప్రేమ, అశీసులతో గర్వించే స్థాయికి వెళ్లాలని నా కోరిక'' అని అన్నారు. శుక్రవారం విడుదల అవుతున్న 'మంగళవారం' సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించాలని కోరారు. 
 
ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ ''కేరళలో మాకు ఫుట్ బాల్ టీమ్ ఉంది. ఈస్ట్ యూరోపియన్ నుంచి వచ్చిన ప్లేయర్... మ్యాచ్ నెగ్గిన తర్వాత 'పుష్ప' మేనరిజం చేశాడు. తెలుగు తెలియని వ్యక్తులకు కూడా భావం చేరిందంటే అల్లు అర్జున్ ఏ స్థాయికి వెళ్ళాడో ప్రేక్షకులు అర్థం చేసుకోవచ్చు.  నేషనల్ అవార్డుకు అల్లు అర్జున్ పూర్తిగా అర్హుడు. అతడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బన్నీకి ఆల్ ది బెస్ట్. మా అమ్మాయి స్వాతికి గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యాక... 'డాడీ నేను ఎక్కడికి వెళ్లను. ఇక్కడే ఉంటా' అని చెప్పింది. మా టీవీలో పని చేయాలని కండిషన్ పెట్టా. కేవలం 18 వేల జీతానికి సురేష్ పక్కన పని చేసింది. అటువంటి స్వాతి ఇవాళ ఓ సినిమా నిర్మించిందంటే తండ్రిగా కాకుండా వ్యక్తిగా చాలా చాలా హ్యాపీగా ఉంది. డిఫికల్ట్ సబ్జెక్టు తీసుకుని సినిమా నిర్మించారు. కసి ఉన్న దర్శకుడిగా అజయ్ భూపతిని చూశా. రెండు మూడు సార్లు కలిశా. కానీ, ఇటువంటి సినిమా తీస్తాడని అనుకోలేదు. అతడు నా అంచనాలను మించిపోయాడు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని అన్నారు.     
 
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు మాట్లాడుతూ ''హాయ్ ఐకాన్ స్టార్ బన్నీ! నీ జర్నీతో పాటు నా జర్నీ చూసుకుంటే వైబ్ మామూలుగా లేదు. 'ఆర్య' పాటకు డ్యాన్స్ చేస్తుంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళా. బన్నీది మామూలు ఘనత కాదు. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడూ రాసి పెట్టుకునే చరిత్ర అయ్యాడు. కంగ్రాట్స్ బన్నీ. 'ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతిపై నా స్పెషల్ ఫోకస్ ఉంది. ఒక డిఫరెంట్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అప్పటి నుంచి ఫాలో చేస్తున్నా. 'మంగళవారం' చేస్తున్నాడని తెలిసి కథ ఏంటని అడిగితే... వచ్చి స్క్రిప్ట్ చెప్పాడు. మళ్ళీ కొత్తగా అటెంప్ట్ చేశారు. ప్రసాద్ గారికి స్వాతి గారికి ఇండస్ట్రీలోకి వెల్కమ్! అజయ్ భూపతికి ఆల్ ది బెస్ట్. నవంబర్ 17న సూపర్ హిట్ కొడుతున్నాడు'' అని అన్నారు. 
 
చిత్ర నిర్మాత స్వాతి మాట్లాడుతూ ''మా 'మంగళవారం' సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా ప్రొడ్యూస్ చేయాలనేది నా డ్రీమ్. నా కలను ఆయన కలగా మార్చుకుని నాతో కలిసి సురేష్ సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు సంతోషంగా ఉంది. దర్శకుడు కథతో చాలా జర్నీ చేస్తారు. అందుకని, ఎవరితో ట్రావెల్ చేయాలనేది ఇంపార్టెంట్. మాతో ట్రావెల్ చేసిన అజయ్ భూపతికి థాంక్స్. ఈ సినిమాకు లైఫ్ క్యారెక్టర్లు. నటీనటులు అందరికీ థాంక్స్. వాళ్లందరినీ చూస్తే... వాళ్ళ కోసం అజయ్ భూపతి క్యారెక్టర్లు రాసినట్లు ఉంటుంది. అజనీష్ గారు ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. 
 
మా ట్రైలర్ లాంచ్ చేసిన చిరంజీవి అంకుల్ గారికి థాంక్స్. మా నాన్నగారు (నిమ్మగడ్డ ప్రసాద్) సక్సెస్  కంటే ప్రాసెస్ ఎంజాయ్ చేయమని చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేశారు. విల్ పవర్ తో ఏం చేసినా సక్సెస్ అంటారు. నా బ్యాక్ బోన్, నా బి భర్త ప్రణవ్ కి థాంక్స్. పెద్ద కలలు కనాలని ఎంకరేజ్ చేశారు. మీ అందరికీ ఐకాన్ స్టార్. నా డియర్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అల్లు అర్జున్. ఆయన వల్లే ఈ సినిమా చేసే ధైర్యం చేశా. తనతో నా డ్రీమ్ గురించి చెప్పినప్పుడు... రియాలిటీలోకి తీసుకు రమ్మని ఎంకరేజ్ చేశారు. నా అవసరం నాకంటే ముందు తెలుసుకుని వచ్చాడు'' అని అన్నారు. 
 
చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ''ఏడాదిన్నర క్రితం అల్లు అర్జున్ గారు పిలిచి 'మంగళవారం' కథ అడిగారు. ఆయన బిజీ షెడ్యూల్ లో రెండు రోజులు పిలిచారు. కథంతా విన్నారు. ఆయన అనుకున్నది చెప్పారు. ఆయనకు గుర్తు ఉందో? లేదో? 'మీరు శభాష్ అనేలా తీస్తా' అని చెప్పారు. టీజర్, ట్రైలర్ వచ్చాయి. ఆయనకు నచ్చిందని అనుకుంటున్నా. సినిమా కూడా ఆయనకు 100 శాతం నచ్చుతుందని ఆశిస్తున్నా. స్వాతి గారు చాలా రోజుల క్రితమే బన్నీ గారు మనకు ఫుల్ సపోర్ట్ అని చెప్పారు. మా ఆఫీసుకు వస్తున్న వాళ్ళకు చాలా రోజుల నుంచి మా ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ గారు వస్తారని చెబుతున్నా. మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఈ రోజు ఆయన వచ్చారు. నేను గానీ, మా టీమ్ గానీ ఆయనను ఎప్పటికీ మర్చిపోం. బన్నీ గారికి చాలా చాలా థాంక్స్. నేను ఇంతకు ముందు తీసిన రెండు సినిమాల్లో ఒకటి ఆడితే మరొకటి ఆడలేదు. ఫ్లాప్ తర్వాత నేను వెళుతుంటే పక్కకి తప్పుకొనేవారు. 
 
'మహా సముద్రం' బ్లాక్ బస్టర్ అయినా నేను 'మంగళవారం' సినిమా తీసేవాడిని. ఇది హీరో లేని సినిమా అనుకోవద్దు. చెన్నైలో మిక్సింగ్ పూర్తి చేసుకుని వచ్చా. సినిమా చూస్తుంటే పూనకాలు వస్తాయి. గూస్ బంప్స్ వస్తాయి. అజనీష్ నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారు. టీమ్ లేకపోతే నేను లేను. టెక్నికల్ వేల్యూస్ ఉన్న మూవీ 'మంగళవారం'. ప్రేక్షకులు షాక్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమా చూసిన ప్రేక్షకులు క్యారెక్టర్లను రివీల్ చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. విలేజ్ నేటివిటీ రస్టిక్ మిస్టీరియస్ థ్రిల్లర్. మనకు కొత్త జానర్ ఇది. పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతుంది. స్వాతి గారు క్లాస్. నేను మాస్. ఆవిడకు కథ నచ్చదని అనుకున్నా. అయితే... స్వాతి గారికి కథ విపరీతంగా నచ్చింది. మా సురేష్ గారికి కూడా! ఫిమేల్ ఓరియెంటెడ్ టచ్ ఉన్న కథ అయినా వెరీ కాంప్లికేటెడ్ పాయింట్ ఉంది. ఇండియాలో ఎవరు టచ్ చేయని పాయింట్ ఉంది. 
 
కథ రాస్తున్నప్పుడు చేతులు వణికాయి. దర్శకుడిగా నాకొక ఛాలెంజ్ ఈ సినిమా. ఇటువంటి సినిమా తీసినప్పుడే మనం అంటే ఏమిటో తెలుస్తుంది. స్వాతి గారు కథ నచ్చిందని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యా. 100 రోజులు అవుట్ డోర్ షూటింగ్ చేశాం. బడ్జెట్ పెరిగింది. ప్రేక్షకులకు హై క్వాలిటీ సినిమా ఇవ్వడం కోసం కష్టపడ్డాం. 100 పర్సెంట్ నెక్స్ట్ లెవల్ లో 'మంగళవారం' ఉంటుంది. ఈ నెల 17న ప్రేక్షకులు అందరూ చూడండి. మా టీమ్ అందరినీ బన్నీ గారు ఆకాశంలో పెట్టారు. 'పుష్ప' సక్సెస్ అయ్యాక సుకుమార్ గారి కంటే నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్ నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ గారు మన అందరికీ గర్వకారణం. 'పుష్ప 2' కోసం ప్రేక్షకుల అందరి కంటే ఎక్కువగా నేను వెయిట్ చేస్తున్నా'' అని అన్నారు.     
 
నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ ''బన్నీ మాకు ఒక్క రోజు ముందు దీపావళి తెచ్చారు. జీవితంలో ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన స్నేహానికి ఎంత విలువ ఇస్తారో తెలుసు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి మా బాస్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు. ఆయన 17 ఏళ్ళ క్రితం నాకు పరిచయం అయ్యారు. ఆ రోజు నుంచి నా జీవితంలో అన్నీ ఆయనే. నాకు పరిచయమైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అన్నీ సురేష్ గారు అని స్వాతి పిలుస్తుంది. ఇక, అజయ్ భూపతికి వస్తే నా తమ్ముడు. దర్శకుడిగా కాకుండా చాలా బాధ్యతలు తీసుకుని తన భుజాల మీద సినిమా తీశాడు. మా టీమ్ అందరికీ థాంక్స్'' అని అన్నారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ ''అల్లు అర్జున్ గారిని చూసి బ్లాంక్ అయిపోయా. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఐదేళ్లు అయ్యాయి. నన్ను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ 'మంగళవారం' కోసం చాలా కష్టపడ్డా'' అని అన్నారు. 
 
నటుడు అజ్మల్ ఆమీర్ మాట్లాడుతూ ''నేను అజయ్ భూపతి ఫ్యాన్. ఆయన తీసిన రెండు సినిమాలు చూశా. 'మంగళవారం'లో నేను నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో పాయల్ అంటే ప్రేక్షకులలో గౌరవం ఏర్పడుతుంది. ఆమెను గ్లామర్ పాత్రల్లో చూశారు. కానీ, ఆమెలో నటిని ఈ సినిమాలో చూస్తారు'' అని చెప్పారు. గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ మాట్లాడుతూ ''సినిమాలో 'గణగణ మోగాలిరా' పాట రాశా. సినిమా తాలూకా ఇతివృత్తాన్ని చెప్పే పాట అది. ఇటువంటి పాట నేను రాయడం తొలిసారి. నాకు అవకాశం ఇచ్చిన అజయ్ భూపతికి థాంక్స్'' అని అన్నారు. 
 
గీత రచయిత సిరాశ్రీ మాట్లాడుతూ ''సినిమాలో ఓ పాట రాయడానికి దర్శకులు అజయ్ భూపతి అరగంట సినిమా చూపించారు. ఒక్కటే చెబుతా... నెక్స్ట్ లెవల్! సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో పేరు వస్తుంది. నేపథ్య సంగీతం, మాటలు మనల్ని ప్రత్యేక ప్రపంచంలోకి తీసుకు వెళతాయి. ఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఫీలవుతున్నా. నాకు అవకాశం ఇచ్చిన అజయ్ భూపతికి థాంక్స్. నిర్మాతగా మారిన అజయ్ భూపతి, స్వాతి రెడ్డి గారు, సురేష్ వర్మ గారికి మంగళవారం మంగళకరం కావాలని ఆశిస్తున్నా'' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత గణేష్, నటులు శ్రీతేజ్, చైతన్య కృష్ణ, రవీందర్ విజయ్, శ్రవణ్ రెడ్డి, లక్ష్మణ్, మురళీధర్ గౌడ్, గిరిధర్, కార్తీక్, మాటల రచయిత తాజుద్దీన్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.