అమలాపాల్‌కు నిశ్చితార్థం జరిగిందా? మాజీ ప్రియుడిపై లైంగిక వేధింపుల కేసు - అరెస్టు
సినీ నటి అమలాపాల్ తరచూ వివాదాల్లో చిక్కుంటున్నారు. గతంలో కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ళ కాపురం తర్వాత ఆయనతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రస్తుతం బ్యాచిలర్ జీవితాన్ని గడుపుతున్నారు. అదేసమయంలో తన స్నేహితుడైన మాజీ ప్రియుడు భవీందర్ సింగ్ దత్‌తో కలిసి ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించింది.
అలా కొంతకాలంగా వారిద్దరూ కలిసిమెలిసి తిరుగుతూ స్నేహితులుగా ఉన్నారు. ఇంతలో వారి స్నేహం బెడిసికొట్టింది. దీంతో స్నేహితుడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శారీరకంగా మానసికంగా వేధించారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు భవీందర్ సింగ్ దత్‌ను అరెస్టు చేసి మంగళవారం విల్లుపురం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
అయితే, భవీందర్ సింగ్ దత్ మాత్రం మరోలా వాదనలు వినపిస్తున్నారు. తనకే ఆమె డబ్బులు ఇవ్వాలని, వాటిని తిరిగి చెల్లించమని అడిగినందుకు తనపై లైంగిక వేధింపుల కేసు పెట్టిందని ఆరోపించారు. "కడావర్" చిత్రాన్ని నిర్మించి రిలీజ్ చేశారు. ఇది ఈ నెల 12వ తేదీన ఓటీటీలో రిలీజ్ అయిందని గుర్తుచేశారు. అయితే, అమలాపాల్ మాత్రం తన ఫిర్యాదులో మరోలా పేర్కొన్నారు. నకిలీ పత్రాలనతో ప్రొడక్షన్ కంపెనీ నుంచి తన పేరును తొలగించారని ఆరోపించారు.
కాగా, భవ్‌నిందర్ సింగ్, అమలాపాల్ కలిసి గత 2018లో ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. ఆ తర్వాత విల్లుపురం జిల్లా కోటకుప్పం సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉంటూ సినిమా ప్రొడక్షన్ వర్క్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వారిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న వార్తలు కూడా వచ్చాయి.
అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరం జరిగారు. తాము సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని భవ్‌నిందర్ తనను బెదిరిస్తున్నాడంటూ అమలాపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఆర్థికంగానూ అతడు తనను మోసం చేశాడని ఈ నెల 26న ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.
అయితే భవ్‌నిందర్ సింగ్‌కు అమలాపాల్‌కు రాజస్థాన్ రాష్ట్రంలో నిశ్చితార్థం జరిగిందని, ఇపుడు వారిద్దరి మధ్య సంబంధాలు తెగిపోవడంతో తనకు ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలని లేనిపక్షంలో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని అమలాపాల్‌ను బెదిరించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంమీద అమలాపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో తన స్నేహితుడు భవ్‌నిందర్ సింగ్ జైలుపాలయ్యాడు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.