గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (14:41 IST)

వెన్నులో వణుకు పుట్టించే ''గతం'' ట్రైలర్ చూస్తే జడుసుకుంటారంతే..! (video)

Gatham
కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె, పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ''గతం''. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. గురువారం ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ చాలా గ్రిప్పింగ్‌గా.. మిస్టరీగా ఉందని ప్రశంసిస్తూ చిత్రయూనిట్‌కు బెస్ట్ విషెస్ అందించాడు సత్యదేవ్.
 
ట్రైలర్‌ను బట్టి చూస్తే యాక్షన్, రొమాన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో బాగా ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని ట్రైలర్‌ను బట్టి అర్థమైపోతుంది. 
 
ఇకపోతే.. ఈ సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. అమేజాన్ ప్రైమ్‌లో వచ్చే నెల అంటే నవంబర్ 6వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆఫ్ బీట్ ఫిలిమ్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై హర్ష ప్రతాప్, సృజన్ ఎరబోలు ఈ సినిమాను నిర్మించనున్నారు.
 
ఈ సందర్భంగా డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ, దర్శకత్వం అంటే తనకెంతో ఇష్టమన్నారు. ''ప్రయోగాలు చేయడం, వివిధ ఫార్మాట్స్‌లో రూపొందించడంపై ఆసక్తి కనబరుస్తాను. గతం సినిమాతో కథ చెప్పే భారతీయ శైలిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, ఏదో ఒక కొత్తదనాన్ని వీక్షకులకు అందించాలని నేను కోరుకుంటున్నాను. గతం కథాంశం అంతా కూడా ఒక ఆసక్తిదాయకమైన ప్రశ్న చుట్టూరా ఉంటుంది. జీవితం పున:ప్రారంభం అయితే ఏం పరిస్థితి అనేదే ఆ ప్రశ్న. ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమేజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షకులకు అందుబాటులోకి రావడం నాకెంతో ఆనందదాయకం'' అని అన్నారు.
 
వెన్నులో వణుకు పుట్టించే సైకలాజికల్ థ్రిల్లర్‌గా గతం రూపుదిద్దుకుంది. అమెరికాకు చెందిన విద్యార్థులు, ఐటీ వృత్తినిపుణులచే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ రూపొందించబడింది. మ్యాంగో మాస్ మీడియాతో కలసి ఆఫ్ బీట్ ఫిల్మ్స్, ఎస్ ఒరిజినల్స్ దీన్ని నిర్మించాయి. భార్గవ పొలుదాసు, రాకేశ్ గలిబె, పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. లేక్ టాహో నేపథ్యంలో రూపుదిద్దుకున్న గతం సినిమా అంతా కూడా కోమా నుంచి కోలుకున్నా, తన గతం మర్చిపోయిన ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. తాను ఎవరో తెలుసుకునేందుకు ఆ వ్యక్తి చేసిన పోరాటం ఆయన జీవితంలో ఊహించని భయంకర సాహసాలకు దారి తీస్తుందని దర్శకుడు చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే అమేజాన్ ప్రైమ్ వీడియో కేటలాగ్‌లో హాలీవుడ్, బాలీవుడ్ నుండి వేలాది టీవీ షోలు, సినిమాలతో ''గతం'' కూడా చేరనుంది. ఇప్పటికే అమేజాన్ ప్రైమ్ వీడియో ద్వారా భారతీయ చిత్రాలు పెంగ్విన్, నిశ్శబ్ధం, హలాల్ లవ్ స్టోరీ, శకుంతల దేవి, గులాబో సీతాబో, పొన్మగల్ వంధాల్, సి యు సూన్, వి, సుఫియం సుజాతమ్, లా, ఫ్రెంచ్ బిర్యానీ వంటివి విడుదలైన సంగతి తెలిసిందే.