శనివారం, 4 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శుక్రవారం, 26 సెప్టెంబరు 2025 (12:12 IST)

Naveen Polishetty: బంగారు ఆభరణాల స్పూఫ్ తో అనగనగా ఒక రాజు రిలీజ్ డేట్

Naveen Polishetty,  Meenakshi Chowdhury
Naveen Polishetty, Meenakshi Chowdhury
తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్‌ పొలిశెట్టి, మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదాల విందుని హామీ ఇచ్చింది.
 
బంగారు ఆభరణాల ప్రకటనపై స్పూఫ్ తో ప్రారంభమైన ఈ టీజర్, ఎంతో వైవిధ్యంగా ఉంది. ఒంటి నిండా ఆభరణాలు ధరించిన మీనాక్షి చౌదరి, తమ సినిమా గురించి కాకుండా ఆభరణాల గురించి మాట్లాడుతుండటంతో.. ఆమె ఆభరణాలను నవీన్ పొలిశెట్టి ధరించి కనిపించడం భలే సరదాగా ఉంది. టీజర్ లో నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి పోటాపోటీగా నవ్వులు పంచారు. వినోదాల వేడుకకు వేదికగా ఈ టీజర్ నిలిచింది. ఇప్పటికే విడుదైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజా టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
 
ఆభరణాల ప్రకటన స్పూఫ్ తో ప్రారంభమైన టీజర్, ఆ తర్వాత సినిమాలోని ఉత్సాహభరితమైన దృశ్యాలను ఆవిష్కరించింది. నవీన్ యొక్క అద్భుతమైన హాస్య చతురత, అనంతమైన ఆకర్షణ ప్రతి ఫ్రేమ్ లో ప్రకాశించింది. తెరపై నవీన్ ఉత్సాహంగా కనిపించిన తీరు.. ఆయన ఈ సినిమా యొక్క గుండె మాత్రమే కాకుండా, సంక్రాంతి వేడుకలకు ముఖం కూడా అని చాటి చెబుతోంది.
 
పండుగ ఉత్సాహం, రంగురంగుల సెట్లు, మాస్ అంశాలు, కామెడీ, రొమాన్స్ మేళవింపుతో ఎంతో వినోదభరితంగా రూపొందిన ఈ టీజర్ కట్టిపడేస్తోంది. సంక్రాంతి పండుగకు ప్రేక్షకులు కోరుకునే అసలైన వినోదాల విందుకి వాగ్దానంలా ఈ టీజర్ నిలిచింది.
 
కేవలం ఒక నిమిషం కంటే ఎక్కువ నిడివితో రూపొందిన ఈ టీజర్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అంతేకాకుండా హాస్యం, తాజాదనం మరియు కమర్షియల్ పంచ్‌లను మిళితం చేసే చిత్రాలను ఎంచుకోవడంలో నవీన్ పొలిశెట్టి నైపుణ్యాన్ని పునరుద్ఘాటించింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ నవీన్ ఖాతాలో మరో ఘన విజయం ఖాయమని ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్‌ పొలిశెట్టి రచయిత కావడం విశేషం. తన రచయితల బృందంతో కలిసి వినోదభరితమైన స్క్రిప్ట్ ని అందించారు. ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కేవలం నవ్వులు పంచడం మాత్రమే కాకుండా, అసలు సిసలైన పండుగ సినిమాని అందించడానికి సిద్ధమవుతున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి, ఛాయాగ్రాహకుడిగా జె యువరాజ్ వ్యవహరిస్తున్నారు.
 
సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానున్న చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్, ఆ అంచనాలను రెట్టింపు చేసింది.