వేశ్యగా మారిన సినీ నటి అంజలి..? ఎందుకోసమంటే..
సినీ నటి అంజలి వేశ్యగా మారిపోయారు. అయితే, నిజజీవితంలో కాదండోయ్... ఆమె నటిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో. తెలుగమ్మాయి అయిన అంజలి... ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన వెబ్ సిరీస్‌లు చేస్తోంది. ఇంతకుముందు ఆమె చేసిన 'ఝాన్సీ' వెబ్ సిరీస్‌కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆమె నుంచి మరో వెబ్ సిరీస్ రావడానికి రంగం సిద్ధమవుతోంది.. ఆ సిరీస్ పేరే 'బహిష్కరణ'. జీ 5, పిక్సల్ పిక్చర్స్ వారు కలిసి నిర్మించిన ఈ సిరీస్‌కి, ముఖేశ్ ప్రజాపతి దర్శకత్వం వహించాడు.
నిజానికి 'బహిష్కరణ' అనేది బలమైన టైటిల్. బరువైన టైటిల్ అనే చెప్పాలి. ఇక ఎంత బలమైన పాత్ర అయినా.. కథనైనా తన భుజాలపై తీరానికి చేర్చగల సత్తా అంజలికి ఉంది. అలాంటి ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, 6 ఎపిసోడ్స్‌గా ఈ నెల 19వ తేదీ నుంచి జీ 5లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఈ సిరీస్‌పై అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ అనే విషయం టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. అంజలి పాత్ర వేశ్య తరహాలో అందాలను ఎరవేస్తూ హత్యలు చేయడం చూపించారు. అంజలి ఆ గ్రామానికి ఎందుకు వస్తుంది? హత్యలు ఎందుకు చేస్తోంది? అనేదే ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. అనన్య నాగళ్ల, రవీంద్ర విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ఎలా ఉంటుందనేది చూడాలి.