సత్తా చాటుతున్న 'బలగం' ... ఖాతాలో ఏకంగా తొమ్మిది
ఒక సినిమా విజయం సాధించాలంటే మంచి కంటెంట్ ఉంటే చాలని.. కథలో సరైన భావోద్వేగాలు పండిస్తే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపించిన చిత్రం 'బలగం'. చిన్న ఆర్టిస్టులతో తెరకెక్కిన ఈ సినిమాకి అంతటా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ దీని హవా కొనసాగిస్తోంది.
ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా తాజాగా అరౌండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ - ఆమ్‌స్టర్‌డామ్ కార్యక్రమంలో మరో అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడి విభాగంలో వేణు దీనిని అందుకున్నారు. యూకే, యూఎస్, చైనా.. ఇలా పలు దేశాలకు చెందిన చిత్రాలు, దర్శకులను వెనక్కి నెట్టి వేణు ఈ అవార్డును అందుకోవడంపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, 'బలగం' ఇప్పటికే 'వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్', 'ఒనికో ఫిల్మ్ అవార్డు' వంటి పలు విదేశీ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన అవార్డుతో 'బలగం' ఖాతాలో ఏకంగా తొమ్మిది అవార్డులు చేరాయని దర్శకుడు వేణు పేర్కొన్నారు. ఈ సక్సెస్‌ను తనకు అందించిన సినీ ప్రియులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి - సంప్రదాయాల నేపథ్యంలో 'బలగం' రూపుదిద్దుకుంది. కుటుంబ పెద్ద చనిపోయాక ఏర్పడిన పరిస్థితుల చుట్టూ ఈ కథను నడిపించారు. రక్త సంబంధాలు, బంధుత్వ విలువలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, రూపా లక్ష్మి తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. దిల్‌రాజు ప్రొడెక్షన్స్ పతాకంపై దిల్‌రాజు కుమార్తె, అల్లుడు హన్షీత, హర్షిత్ దీనిని నిర్మించారు.