శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (11:11 IST)

కౌశల్ ఆర్మీ దెబ్బకు బిగ్ బాస్ షోకు తాళం వేసేసుకుంటాడా?

బిగ్‌బాస్‌ షో అంటే ఆ ఇంటిలో ఉండే సభ్యుల భావోద్వేగాల నియంత్రణకు, వ్యక్తిత్వాలకు పరీక్ష వంటిది. ఆ పరీక్షలో నిలబడి గెలిచినవారే విజేతలవుతారు. ప్రేక్షకుల ఓట్లు ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. ఇదే ఎంతో పాపులర్‌ అయిన బిగ్‌బాస్‌ షో మూలసూత్రం. తాజాగా జరుగుతున

బిగ్‌బాస్‌ షో అంటే ఆ ఇంటిలో ఉండే సభ్యుల భావోద్వేగాల నియంత్రణకు, వ్యక్తిత్వాలకు పరీక్ష వంటిది. ఆ పరీక్షలో నిలబడి గెలిచినవారే విజేతలవుతారు. ప్రేక్షకుల ఓట్లు ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. ఇదే ఎంతో పాపులర్‌ అయిన బిగ్‌బాస్‌ షో మూలసూత్రం. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే… బిగ్‌బాస్‌ చెబుతున్న ప్రేక్షకుల ఓట్లు విధానానికి విలువ లేకుండా పోయేలా వుంది. బిగ్‌బాస్‌ షోని ముగించి వెంటనే ఇంటికి తాళం వేసేయొచ్చు. 
 
ఎందుకంటే… బిగ్‌బాస్‌ ఇంట్లో ఉంటున్న కౌశల్‌ పేరుతో బయట జరుగుతున్న హడావుడి అంతా ఇంతాకాదు. అయన అభిమానులు అనడం కంటే ఆయనకున్న ప్రకటనల నిర్మాణ సంస్థ ద్వారా, సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని బిగ్‌బాస్‌ షోను శాసించేంతగా వ్యవహారాలు సాగిస్తున్నారు. కౌశల్‌ ఆర్మీ పేరుతో ఫేస్‌బుక్‌లో పేజీలు తెరచి ప్రచారం చేస్తున్నారు. వేలాదిమందిని సభ్యులుగా చేర్చి… ఓట్లు వేయడమే పనిగా పెట్టుకుని బిగ్‌బాస్‌ ఓటింగ్‌ను ప్రభావితం చేస్తున్నారు.
 
ఆదివారం నాడు హైదరాబాద్‌లో కౌశల్‌ ఆర్మీ 2కె వాక్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. అంటే వీరంతా కౌశల్‌కు వారంవారం ఓట్లు వేస్తున్నట్లే లెక్క. ఒక్కో వ్యక్తి రోజుకు 50 ఓట్లు వేయొచ్చు. ఆ లెక్కన ఆరు రోజులకు 300 ఓట్లు వేయడానికి వీలుంది. ఈ లెక్కన కౌశల్‌ ఆర్మీ వేసే ఓట్లే లక్షల్లో ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మిగతా సభ్యులు కౌశల్‌ దరిదాపుల్లోకి వచ్చే అవకాశమే లేదు.
 
బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవడం ద్వారా ఎంత బహుమానం వస్తుందనేది పక్కన పెట్టేసి గెలవడమే లక్ష్యంగా, గెలుపు కోసం కౌశల్‌ ఆర్మీ భారీగానే ఖర్చు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సోషల్‌ మీడియాలో చేస్తున్న హడావుడి వెనుక, ఓట్లు వెనుక ఆర్థిక లావాదేవీలు లేవని అనుకోలేం. ఎందుకంటే బిగ్‌బాస్‌ షోలోని ఒక సభ్యుని కోసం వేలాది మంది రోడ్డుపైకి వచ్చి ర్యాలీలో పాల్గొనడం ఆశ్చర్యం కలిగించే అంశమే. అదేపనిగా దీన్ని ఆర్గనైజ్‌ చేయకపోతే ఇటువంటిది సాధ్యం కాదు. ఇదంతా చూస్తుంటే కౌశల్‌ బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లేముందే పక్కాగా ప్లాన్‌ చేసి వెళ్లినట్లు అర్థమవుతుంది.
 
బిగ్‌బాస్‌ ఇంట్లో కౌశల్‌ ఎవరితోనైనా గొడవపడితే… బయట ఈ ఆర్మీ ఆ సభ్యులపైన దాడికి పూనుకుంటోంది. అతని వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెడుతుంది. బూతులు తిడుతుంది. ఆఖరికి హోస్ట్‌ నానిని కూడా విడిచిపెట్టకుండా కౌశల్‌ ఆర్మీ దాడి చేస్తోంది. ఈ దెబ్బకు నాని కూడా కాస్త జంకుతున్నట్లు అనిపిస్తుంది. ఆయన కౌశల్‌తో చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. తనతో పెట్టుకుంటే ఎవరైనా బయటకు వెళ్లిపోవాల్సిందే అని కౌశల్‌ బిగ్‌బాస్‌ ఇంట్లో వ్యాఖ్యానించారంటే…. ఆయన బయట ఎంత కసరత్తు చేసి వచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ కూడా ఏమీ చేయలేకున్నారు. అందుకే కౌశల్‌ను విజేతగా ప్రకటించి, బిగ్‌బాస్‌ హౌస్‌కు తాళం వేసేసుకుంటారేమోనన్న చర్చ అయితే యమ జోరుగా జరుగుతోంది.