నటుడు శరత్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నారు.. వదంతులు నమ్మొద్దు
తమిళ హీరో, అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు ఆర్.శరత్ కుమార్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని ఆయన పీఆర్వో అధికారికంగా వెల్లడించారు. చిన్నపాటి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారని, ఈ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంటారని తెలిపారు. అంతేకానీ, ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న వందతులను నమ్మొద్దని పీఆర్వో విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, తీవ్ర అస్వస్థతకు గురైన శరత్ కుమార్‌ను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య రాధికా శరత్ కుమార్, కుమార్తె వరలక్ష్మి ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే, శరత్ కుమార్ డయేరియా, డీహైడ్రేషన్ కారణంగానే ఆస్పత్రిలో చేరినట్టు వైద్య వర్గాల సమాచారం. కానీ, ఆస్పత్రి వర్గాల నుంచి శరత్ కుమార్ ఆరోగ్యంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు.