ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2022 (21:48 IST)

ప్రజల మనసుల్లో స్వరంజీవిగా నిలిచిన శతాబ్ధి గాయకుడు ఘంటసాల : వెంకయ్య నాయుడు

venkaiah naidu
* భాష, కళలు, సంస్కృతిని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత
* భారతీయులు సంగీతాన్ని వినోద సాధనంగానే గాక, విజ్ఞాన సాధనంగానూ చూశారు
* సంగీతానికి ఉన్న శక్తిని ముందుతరాలకు తెలియజేసేందుకు మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది
* చెన్నైలో శ్రీ ఘంటసాల గారి శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
* శ్రీ ఘంటసాల నాదోపాసనలో జీవితాన్ని ధన్యం చేసుకున్నారు
* శ్రీ ఘంటసాల గారి 108 శ్లోకాల భగవద్గీత సామాన్యులకు సైతం ఆ మహోన్నత గ్రంథాన్ని చేరువ చేసింది.
* వారసత్వం అంటే పెద్దల జవసత్వాలను అందిపుచ్చుకోవటమే, వారి స్ఫూర్తిని కొనసాగించటమే
 
భాష, కళలు, సంస్కృతిని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఘంటసాల వెంకటేశ్వర రావు వంటి మహనీయులకు అదే నిజమైన నివాళి అని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయులు సంగీతాన్ని వినోద సాధనంగానేగాక, విజ్ఞాన సాధనంగానూ చూశారన్న ఆయన, సంగీతానికి ఎన్నో మానసిక సమస్యలను దూరం చేయగల శక్తి ఉందని, ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతిని పురస్కరించుకుని చెన్నైలో కేంద్ర సాంస్కృతిక శాఖ, కళాప్రదర్శిని ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. నాదోపాసనలో జీవితాన్ని ధన్యం చేసుకున్న ఘంటసాల, ప్రజల మనసుల్లో స్వరంజీవిగా నిలిచారని, వారు శతాబ్ధి గాయకుడన్నారు. 
 
గాయకుడిగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవటమే, ఘంటసాల స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారన్న విషయం చాలా మందికి తెలియదన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" నేపథ్యంలో వారి శతజయంతి రావటం, వారి దేశభక్తిని స్మరించుకోవడం ఆనందదాయకమని తెలిపారు. 
 
చిన్నతనం నుంచి అనేక ఆటుపోటుల మధ్య మొక్కవోని దీక్షతో సంగీత ప్రపంచంలో ఆదర్శనీయంగా ఎదిగిన ఘంటసాల జీవితం యువతకు ఆదర్శనీయమైనదన్న ఆయన, వారి స్ఫూర్తితో యువత సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఘంటసాల కోడలు శ్రీమతి పార్వతి రవిని అభినందించిన ఆయన, వారసత్వమంటే ఇదేనని, పెద్దల జవసత్వాలను, వారి స్ఫూర్తిని అందిపుచ్చుకోవటమే అని తెలిపారు. ఓ కళాకారుని జయంతి సందర్భంగా మరెంతో మంది కళాకారులను గౌరవించుకోవటం చక్కని సంప్రదాయమని తెలిపారు.
thota tarani
 
"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః" అన్న పెద్దల మాటలను ఉదహరించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, అమ్మ పలుకుల్లో మాతృభాష, అమ్మలాలి పాట ద్వారా సంగీతం ప్రతి ఒక్కరికీ చిన్నతనంలోనే పరిచయమౌతాయన్నారు. దేశదేశాల సంస్కృతి, సంప్రదాయాలు, సాంఘిక జీవనాన్ని బట్టి సంగీతంలో అనేక మార్పులు చోటుచేసుకున్నా, ఆస్వాదించే మనసు మాత్రం అందరికీ ఒక్కటేనని పేర్కొన్నారు. 
 
శ్రీ త్యాగరాజ స్వామి, శ్రీ జయదేవుడు, శ్రీ అన్నమయ్య, శ్రీ రామదాసు, శ్రీ క్షేత్రయ్య, శ్రీ నారాయణ తీర్థులు వంటి ఎందరో మహనీయులు సంగీత ఉపాసనలో జీవితాన్ని ధన్యం చేసుకున్న ఆయన, సినిమా సంగీతాన్ని ఆస్వాదించదగినదైతే... శాస్త్రీయ సంగీతం అనుభవైకవేద్యమైనదని తెలిపారు. 
 
జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఘంటసాల గారు తనకు జీవితాన్ని ఇచ్చిన వారిని మరువలేదన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, "ఏ తల్లి తొలి ముద్ద వేసిందో... ఆమె ఆశీర్వాద ఫలమే ఈ వైభవం" అన్న శ్రీ ఘంటసాల గారి మాటలను గుర్తు చేశారు. గురువైన పట్రాయని సీతారామ శాస్త్రి గారిని జీవితాంతం గుర్తు పెట్టుకుని గౌరవించుకున్న వారి స్ఫూర్తి ఈ తరం కళాకారులకు ఆదర్శం కావాలని సూచించారు. 
 
జీవితంలో ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, చదువు చెప్పిన గురువును మరువకూడదని తాను ఎప్పుడూ చెప్పే మాటల్లోని అంతరార్థం ఇదేనన్న ఆయన, మన ఉన్నతికి కారణమై చేయూతనిచ్చిన వారిని గుర్తు పెట్టుకోవటమే గాక, ఔత్సాహికులకు చేయూతను అందించటం మనందరి ప్రథమ కర్తవ్యంగా భావించాలని సూచించారు.
gantasala
 
సినిమా పాటలతోనే గాక భక్తిగీతాలతో ఘంటసాల గారు ప్రేక్షకాభిమానం సంపాదించుకున్నారన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, వారు చొరవ తీసుకుని రూపొందించిన 108 శ్లోకాల భగవద్గీత ఆడియో సామాన్యులకు సైతం ఆ మహోన్నత గ్రంథాన్ని చేరువ చేసిందని తెలిపారు. రేడియో, గ్రామ్ ఫోన్ రికార్డుల కాలంలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన పుష్పవిలాపం పద్యాలు ఘంటసాల గొంతులో కరుణ రసాత్మకంగా శ్రోతల్ని పులకింపజేశాయన్న ఆయన, వారి స్వరానికి భారతప్రభుత్వ అందించే పద్మశ్రీ గౌరవం సహా, అనేక అవార్డులు దాసోహమయ్యాయని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సుధారాణి రఘుపతి, ఎల్.ఆర్.ఈశ్వరి, నందిని రమణి, అవసరాల కన్యాకుమారి, తోట తరణి, శివమణి, దయాన్బన్‌లకు ఘంటసాల గారి పేరిట ఏర్పాటు చేసిన అవార్డులను ముప్పవరపు వెంకయ్యనాయుడు అందజేశారు. కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర మంత్రి మనో తంగరాజన్, సంగీత నాటక అకాడమీ ఛైర్ పర్సన్ డా. సంధ్య పురేస, ఘంటసాల కుటుంబ సభ్యులు, అభిమానులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.