శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (14:06 IST)

సునీల్ ప్రాణలు కాపాడిన చిరంజీవి.. ఎలా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో తాను పైకి రావడమే కాకుండా, ఎంతో మందికి లైఫ్ ఇచ్చారని చెబుతారు. అతని వలన పేరు తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. కానీ హీరో కమ్ కమెడియన్ సునీల్ మాత్రం చిరంజీవి తన ప్రాణాలనే కాపాడారని చెప్పారు. తాను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి చిరంజీవి అని సునీల్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. 
 
చిరంజీవి అంటే తనకు చాలా అభిమానమన్నాడు. చిరు తన ప్రాణాలను ఎలా కాపాడాడో కూడా వివరించాడు. చిరుతో కలిసి "ఠాగూర్" సినిమాలో నటించే సమయంలో ఒక రోజు షూటింగ్ అయ్యాక భీమవరంకి బయలుదేరానని, చిరుకు ఈ విషయం చెప్పగా సీటు బెల్టు పెట్టుకోవడం మరిచిపోవద్దు అని హెచ్చరించినట్లు సునీల్ తెలిపాడు. ఆ రోజు ప్రయాణంలో కారుకి యాక్సిడెంట్ అయ్యి నాలుగు ఫల్టీలు కొట్టిందని చెప్పారు. సీటు బెల్టు పెట్టుకుని ఉండటం వలన ప్రమాదం తప్పిందని చెప్పారు. 
 
ఈ విషయంలో చిరుకి తాను రుణపడి ఉంటానన్నాడు. తన లైఫ్‌లో ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయని, దేవుని దయవల్ల ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు. "నువ్వే కావాలి" సినిమా సమయంలో కూడా చాలా పెద్ద ప్రమాదం తప్పినట్లు అతను తెలిపాడు. కొన్ని సందర్భాల్లో తాను చనిపోయినట్లు కూడా టీవీ ఛానెళ్లలో ప్రకటించారని చెప్పారు. తాను ఆసుపత్రిలో కళ్లు తెరిచిన ప్రతిసారీ కళ్ల ముందు తన ఆప్త మిత్రుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' ఉండేవాడని సునీల్ చెప్పాడు.