మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (08:32 IST)

అడ్డదారిలో గుర్తింపు కోరుకునేవారు అలా మాట్లాడుతారు : చిరంజీవి

Megastar Chiranjeevi
అడ్డదారిలో గుర్తింపు కోరుకునే వాళ్లు తన గురించి, తన కుటుంబ సభ్యుల సభ్యుల గురించి అలానే, ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటారని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇటీవల ఏపీ మంత్రి ఆర్కే రోజా చిరంజీవిని, ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్‌‍ల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసాయి. వీటిపై చిరంజీవి స్పందించారు. 
 
తన గురించి మాట్లాడితేనే వారికి గుర్తింపు వస్తుందన్నారు. అడ్డాదారిలో గుర్తింపు కోరుకునే వాళ్లు తనను, తన ఫ్యామిలీని తిడుతుంటారని చెప్పారు. ఇండస్ట్రీలో ఉన్నపుడు తనతో స్నేహంగా ఉన్నవాళ్లే ఇపుడు తన గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీ మంత్రిగా రోజా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మా ఇంటికి వచ్చారని గుర్తు చేశారు. 
 
ఇపుడు ఆమె అలా ఎందుకు మాట్లాడిందో ఆమెనే అడగాలని సూచించారు. ఇకపోతే, తాను  ఎవరికీ సహాయం చేయలేదని అంటున్నారని, తన గురించి తెలిసి మాట్లడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రశాంతంగా ఉండటమే తనకు తెలుసని, అందుకే తమను ఎంతగా విమర్శించినా తాను తిరిగి తిట్టనని చెప్పారు. 
 
కాగా, ఇటీవల రోజా మాట్లాడుతూ, సినిమాల్లో ప్రజల డబ్బుతో మెగా ఫ్యామిలీ ఎంతో ఎత్తుకు ఎదిగిందని, కానీ, ప్రజలకు వారు ఓ చిన్న సాయం కూడా చేయలేదన్నారు. అందుకే అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాల్లోనే ప్రజలు చిత్తుగా ఓడించారని, మెగా బ్రదర్స్‌కు రాజకీయ భవిష్యత్ లేదని చెప్పారు.