గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 జులై 2022 (12:11 IST)

సివిల్ కేసు.. కోర్టుకు హాజరైన దగ్గుబాటి రానా

Rana Daggubati
బాహుబలి భల్లాలదేవుడు రానా దగ్గుబాటి సివిల్ కేసు కోసం కోర్టుకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో ప్లాట్‌ నెం. 2 సినీ నటి మాధవి (మాతృదేవోభవ హీరోయిన్‌)కు సొసైటీ కేటాయించింది. అయితే ఆమె 2200 గజాల ప్లాట్‌ను సినీ నిర్మాత సురేష్‌ దగ్గుబాటి, వెంకటేశ్‌కు విక్రయించి వెళ్లిపోయింది. సదరు స్థలంలో వెయ్యి గజాలు నిర్మాత సురేష్‌ దగ్గుబాటి పేరు మీద, 1200 గజాలు హీరో వెంకటేష్‌ పేరున ఉన్నాయి.
 
2014లో ఈ స్థలంలోని రెండు ప్లాట్లను ఎమ్మెల్యే కాలనీకి చెందిన నందకుమార్‌ అనే వ్యాపారికి లీజు అగ్రిమెంట్‌ చేశారు. నెలకు రూ. 2 లక్షలు చెల్లించే విధంగా ఈ రెండు ప్లాట్లను లీజు అగ్రిమెంట్‌చేయగా 2014లో ఒకసారి, 2016లో మరోసారి లీజు రెన్యూవల్‌ జరిగింది. 
 
2017లో ఈ ప్లాట్‌ను విక్రయించేందుకు సిద్ధమై లీజు అగ్రిమెంట్‌లో ఉన్న నందకుమార్‌ను సంప్రదించారు. గజం రూ.1.80 లక్షలు చొప్పున నందకుమార్‌ ఈ ప్లాట్‌ మొత్తానికి రూ. 6 కోట్లు చెల్లించి అగ్రిమెంట్‌ ఆఫ్‌సేల్‌ చేసుకున్నాడు.
 
అయితే ఈ ప్లాట్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో వేరే వ్యాపారి వచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పడంతో నందకుమార్‌ అగ్రిమెంట్‌ను పక్కన పెట్టి మరో వ్యక్తికి సేల్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ చేశారు. 2017లో ఈ ఒప్పందం ఉల్లంఘించగా నందకుమార్‌ కోర్టును ఆశ్రయించాడు. ఒకరికి తెలియకుండా మరొకరికి దగ్గుపాటి సురేష్‌ ఈ సేల్‌ అగ్రిమెంట్‌చేసినట్లుగా కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.
 
ఇదిలా ఉండగానే దగ్గుపాటి సురేష్‌ ఈ ప్లాట్‌లోని వెయ్యి గజాలను తన కుమారుడు రానా దగ్గుబాటి పేరున రిజిస్ట్రేషన్‌ చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు బాధితులు కోర్టును ఆశ్రయించడంతో రానా దగ్గుబాటికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేయగా మంగళవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు.