గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (18:36 IST)

టి.కృష్ణ వంటి వ్య‌క్తుల జీవితాల‌ను జ‌నాల్లోకి తీసుకెళ్లాలి: దాసరి

అభ్యుద‌య చిత్రాల ద‌ర్శ‌కుడు టి.కృష్ణ పై సీనియ‌ర్ అండ్ సిన్సియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు ర‌చించిన `వెండితెర అరుణ‌కిర‌ణం టి.కృష్ణ‌` పుస్త‌కావిష్క‌ర‌ణ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

అభ్యుద‌య చిత్రాల ద‌ర్శ‌కుడు టి.కృష్ణ పై సీనియ‌ర్ అండ్ సిన్సియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు ర‌చించిన `వెండితెర అరుణ‌కిర‌ణం టి.కృష్ణ‌` పుస్త‌కావిష్క‌ర‌ణ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు పుస్త‌కాన్ని ఆవిష్క‌రించి.. తొలి ప్ర‌తిని టి.కృష్ణ త‌నయుడు, క‌థానాయ‌కుడు గోపిచంద్‌కు అంద‌జేశారు. సారిప‌ల్లి కొండ‌ల‌రావు సార‌థ్యంలో యువ‌క‌ళావాహిని ఆధ్వ‌ర్యంలో ఈ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది.
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నార‌య‌ణ‌రావు మాట్లాడుతూ.. 'ప‌సుపులేటి రామారావు టి.కృష్ణపై పుస్త‌కం రాస్తున్నా అని చెప్ప‌గానే చాలా సంతోషించా. 45 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్ప‌టికే అలాగే ఉన్నాడు రామారావు. త‌ను లాభాలు ఆశించి పుస్త‌కాలు రాసే వ్య‌క్తి కాదు. టి.కృష్ణ‌లాగే గొప్ప లెఫ్ట్ భావాలు ఉన్నవాడు. సినిమా చ‌రిత్రను జనాల్లోకి తీసుకెళ్లాల‌న్న సంక‌ల్పంతో  పుస్త‌కాలు రాస్తుంటాడు. ఈ పుస్త‌కం కూడా అందులో భాగ‌మే. చాలా మంది ప్రాచుర్యం పొందిన కొంత మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు, హీరోల పేర్లే ప్ర‌స్తావిస్తుంటారు త‌ప్ప... మ‌ధ్య‌లో వారిని వ‌దిలేస్తుంటారు. 
 
కానీ, ఎవ‌రి పంథాలో వారు గొప్పవారే. మా జ‌న‌రేష‌న్లో కొత్త భావాలు, కొత్తత‌రం ద‌ర్శ‌కుడుగా టి.కృష్ణ గొప్ప పేరు తెచ్చుకున్నాడు. వాస్త‌వాల‌ను తెర‌కెక్కించాలంటే ఆ ద‌ర్శ‌కుడిలో నిజాయితీ ఉండాలి. అప్పుడే ఆ సినిమాను ర‌క్తి క‌ట్టించ‌గ‌ల‌డు. అలాంటి నిజాయితీ ఉన్న ద‌ర్శ‌కుడు కాబ‌ట్టే ఆరు అద్భుత‌మైన చిత్రాలు చేశారు. ఇటువంటి గొప్ప ద‌ర్శ‌కుడు చ‌నిపోయిన‌ప్పుడు ఏర్పాటు చేసిన సంతాప స‌భ‌కు కేవ‌లం 11 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఆ స‌మ‌యంలో నేను ఏడ్చాను. ఆ స‌భ‌లో చాలా ఉద్వేగంగా మాట్లాడాను. చాలా మంది మీద కోప‌డ్డాను. తెలుగు సినిమా చ‌రిత్ర రాయాల్సి వ‌స్తే అందులో రెండు పేజీలు అట్టి పెట్టాల్సిన ద‌ర్శకుడు టి.కృష్ణ‌. ప్ర‌జ‌లు ఆయ‌న‌పై ఎంతో అభిమానాన్ని కురిపించారు. అలాంటి గొప్ప వ్య‌క్తుల చ‌రిత్ర జ‌నాల్లోకి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఘంట‌సాల‌ను సినిమా ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసింది కృష్ణ‌వేణి. కానీ, ఎంత మందికి ఈ నిజాలు తెలుసు. నేను గ‌త మూడున్న‌ర ఏళ్లుగా సినీ చ‌రిత్ర గురించి ఒక పుస్త‌కం రాస్తున్నా.. ఇంకా ఏడాదిన్న‌ర ప‌ట్టే అవ‌కాశం ఉంది. దాని ద్వారా ఎన్నో నిజాలు తెలిసే అవ‌కాశం ఉంది. ఇక‌ కృష్ణ గురించి చెప్పాలంటే... త‌న‌కు నాకు మంచి అనుబంధం ఉంది. నారాయ‌ణ‌మూర్తి హీరోగా `ఒరేయ్ రిక్షా` సినిమాను డైర‌క్ట్ చేయ‌మ‌ని కృష్ణ‌ను అడిగాను. చాలా సంతోషించాడు. మీలాంటి గొప్ప ద‌ర్శ‌కుడు నిర్మాణంలో నేను ద‌ర్శ‌క‌త్వం చేసే అవ‌కాశం రావ‌డం నా అదృష్టం అన్నాడు. కానీ నా అభిప్రాయాన్ని రెండు రోజుల్లో చెబుతానన్నాడు. నేను ఈ సినిమా చేయ‌లేను... ఎందుకో మీకు త్వ‌ర‌లో తెలుస్తుందంటూ ఓ పేప‌రులో రాసి పంపించాడు. నాకు త‌ర్వాత తెలిసింది త‌నకు ఆరోగ్యం బాగోలేద‌ని. ఒక  గొప్ప వ్య‌క్తి, గొప్ప ద‌ర్శ‌కుడు పై ప‌సుపు లేటి రామారావు ఈ పుస్తకం రాసినందుకు త‌న‌ను మ‌న‌సారా అభినందిస్తున్నా' అన్నారు. 
 
న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ...'అప్ప‌టి వ‌ర‌కు ఆరు పాట‌లు, ఐదు ఫైట్స్‌తో కూడిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో న‌టిస్తున్న నాతో `నేటిభార‌తం` చేశారు.  అప్ప‌టివ‌ర‌కున్న నా శైలినే మార్చేశారు. ఆ  సినిమాలో నా పాత్ర‌ను ఆద‌ర్శంగా తీసుకున్న వారు ఎంతో మంది ఇప్ప‌టికీ ఉన్నారు. హార్డ్ వ‌ర్క‌ర్, సింప్లిసిటీ ఉన్న వ్య‌క్తి కృష్ణ‌. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం నాకు డిఫ‌రెంట్ ఎక్స్ పీరియ‌న్స్. అటువంటి వ్య‌క్తి పై పుస్త‌కాన్ని ర‌చించిన పసుపులేటి రామారావుని మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నా' అన్నారు.
 
క‌థానాయకుడు గోపీచంద్ మాట్లాడుతూ.. 'నాన్న‌గారు మ‌ర‌ణించిన‌ప్పుడు నాకు తొమ్మిదేళ్లు. కాబ‌ట్టి నాన్న గురించి నాకు ఎక్కువ‌గా తెలియ‌దు. ఇక్క‌డ వారి మిత్రులు చెబుతుంటే అంత మంచి తండ్రికి కొడుకుని అయినందుకు అదృష్టంగా భావిస్తున్నా. ఎంతో మంది ద‌ర్శ‌కుల‌కు ఇనిస్పిరేష‌న్‌గా నిలిచారు. ఆయ‌న‌లో మంచి న‌టుడు కూడా ఉన్నారు. నారాయ‌ణ మూర్తిగారి `అర్థరాత్రి స్వ‌తంత్రం`లో నాన్న‌గారు న‌టించారు. ఇప్ప‌టికీ ఆ సీన్ నా మొబైల్‌లో ఉంది. న‌ట‌న‌లో ఆయ‌నే నాకు ఇనిస్పిరేష‌న్. ఇంకా నాన్న‌గారిలా న‌టించ‌లేక‌పోతున్నా అనుకుంటుంటాను. నాన్న‌గారిని ఎంత‌వ‌ర‌కు రీచ్ అవుతానే తెలియ‌దుకానీ నేను కృష్ణ కొడుకుని అని గ‌ర్వంగా చెప్పుకుంటా. ఈ పుస్త‌కం వెల‌క‌ట్ట‌లేనిది. ఇందులో తెలుసుకోవ‌ల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మ‌న‌స్ఫూర్తిగా పసుపులేటి రామారావు గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నా' అన్నారు.