మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 22 నవంబరు 2023 (11:42 IST)

తప్పుగా మాట్లాడలేదు... క్షమాపణ చెప్పనుగాక చెప్పను : మన్సూర్ అలీఖాన్

mansoor alikhan
హీరోయిన్ త్రిషను ఉద్దేశించి తాను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని, అందువల్ల తాను ఆమెకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని నటుడు మన్సూర్ అలీఖాన్ స్పష్టం చేశారు. పైగా, తాను త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ నడిగర్ సంఘం బహిరంగ ప్రకటన చేసి చాలా తప్పు చేసిందని, ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని తానే నడిగర్ సంఘానికి గడువు ఇస్తున్నానని హెచ్చరించారు. 
 
లియో చిత్రంలో హీరోయిన్‌గా నటించిన త్రిష‌ను ఉద్దేశించి మన్సూర్ అలీఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేయగా అది పెద్ద వివాదంగా మారిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీకి సైతం జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనపై థౌజండ్ లైట్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద మంగళవారం అరెస్టు చేశారు. 
 
ఇదిలావుంటే మంగళవారం నుంగంబాక్కంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, త్రిషను ఉద్దేశించి తాను ఎలాటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. పైగా, త్రిషను పొగుడుతూ మాట్లాడానని, అందుకు తనకే ఆమె క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. 
 
ఒక చిత్రంలో రేప్ సీన్ ఉందంటే నిజంగానే రేప్ చేస్తారా? ఒక హీరో హత్య చేశారంటే నిజంగానే చంపేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. పైగా, ఎపుడో మాట్లాడిన విషయాన్ని తీసుకుని ఇపుడు రాద్దాంతం చేస్తున్నారని, ఇది ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. 
 
అదేవిధంగా నడిగర్ సంఘం కూడా తన విషయంలో తప్పు చేసిందన్నారు. ఈ వ్యవహారంలో తనను ఒక్కరంటే ఒక్కరు కూడా సంప్రదించకుండా బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ఎలా పత్రికా ప్రకటన విడుదల చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రకటనను తక్షణం వెనక్కి తీసుకుని తనకు నియమ నిబంధనల మేరకు నోటీసులు జారీ చేయాలని మన్సూర్ అలీఖాన్ సూచించారు.