సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2024 (15:49 IST)

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ramgopalvarma-chandrababu
రాంగోపాల్ వర్మ కోసం ఒంగోలు పోలీసులు హైదరాబాదులోని ఆయన ఇంటి ముందు తిష్ట వేసి వున్నారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులకు వర్మ ఇంట్లో లేరని ఆయన సిబ్బంది చెబుతున్నారు. షూటింగ్ బిజీలో వున్నారంటూ వారు చెబుతున్నారు. ఐతే వర్మ ఫోన్ నెంబర్లను ట్రేస్ చేసిన పోలీసులు ఆయనకి చెందిన రెండు నెంబర్లూ ఇంట్లోనే వున్నట్లు సూచిస్తున్నాయి. దీనితో పోలీసులు అక్కడే తిష్ట వేసారు. కాగా తనను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో వర్మ తన రెండు ఫోన్లను ఇంట్లోనే వదిలేసి కోయంబత్తూరుకి జారుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
 
వర్మ కోసం పోలీసులు గాలింపు ఎందుకు?
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై ప్రకాశం జిల్లాలో పలు కేసులు నమోదైవున్నాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఒకసారి నోటీసు జారీ చేయగా షూటింగ్ ఉందని విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈ నెల 20వ తేదీన హాజరుకావాలని ఆదేశించగా, కొంత సమయం కోరారు. దీనితో 25న తప్పకుండా వస్తానని చెప్పారు. ఐతే ఈరోజు కూడా రాలేదు.
 
మరోవైపు అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌‍లపై మార్ఫింగ్ ఫోటోలకు సంబంధించే ఈ కేసు కూడా నమోదు కావడం గమనార్హం. ఈ కేసులో గురువారం హాజరు కావాలంటూ రావికమతం పోలీసులు పేర్కొన్నారు. అయితే, వర్మ హాజరు కాకుండా మరోవారం రోజులు కోరినట్టు తెలిసింది.