చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు
ఏపీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులు చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. మద్యం కేసులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
మరోవైపు, మద్యం ముడుపుల కేసులో పరారీలో ఉన్న నిందితులపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. పరారీలో ఉన్న 12 మంది అరెస్టుకు వారెంట్ జారీ చేయాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారి అరెస్టుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి, పురుషోత్తం, అనిరుధ్ రెడ్డి, షేక్ సైఫ్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, బొల్లారం శివ, రాజీవ్ ప్రతాప్ సహా పలువురు నిందితులుగా ఉన్నారు.
పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు
తనకు రాజకీయ పదవులపై ఆశలేదని, కేవలం జనసేన పార్టీ కార్యకర్తగానే ఉంటానని జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కె.నాగబాబు అన్నారు. తన సోదరుడు, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఈ నెల 24వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంపై కె.నాగబాబు స్పందిస్తూ, 'హరిహర వీరమల్లు' చిత్రంపై వైకాపా నేతల దష్ప్రచారం దుర్మార్గం అన్నారు.
వైకాపాని, ఆ పార్టీ నేతలను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం విషయంలోనూ వైకాపా చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని కూటమి నేతలు, కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అదేసమయంలో మరో రెండు దశాబ్దాల పాటు వైకాపా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన జోస్యం చెప్పారు.
ఇకపోతే తనకు రాజకీయ పదవులపై ఏమాత్రం ఆశ లేదన్నారు. జనసేన పార్టీ కార్యకర్తగానే ఉండేందుకు ఇష్టపడతానని చెప్పారు. పార్టీలో ఇప్పటివరకు కమిటీలు వేయలేదని, అయినప్పటికీ కార్యకర్తలు సహనం పాటిస్తూ, సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించిన కార్యకర్తలనే నామినేటెడ్ పదవులకు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.