ఇ.వి.వి.ని ఆదుకుంది ఎవరో తెలుసా|
దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ అంటే తెలుగు వారికి తెలియందికాదు. ఆయన పూర్తి పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. పశ్చిమ గోదావరిలోని కోరుమామిడిలో జన్మించిన ఆయన వర్థంతి జనవరి 21. సినిమా పరిశ్రమ ప్రస్తుతం మర్చిపోయినా ఆయన శిష్యులు మాత్రం ఆయన్ను గుర్తుచేసుకుంటూనే వుంటారు. ఇ.వివి. చిన్నతనంలోనే రామారావు, నాగేశ్వరరావు ప్రేరణలో సినిమాలరంగంలోకి రావాలని కలలు కన్నాడు.దాంతో చదువు కొండెక్కింది. ఆ సినిమాలు చూసి కథలు రాసుకోవడం ఆరంభించారు. తొలుత నవత కృష్ణంరాజు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత దేవదాస్ కనకాల దగ్గర నాగమ్మ, ఓ ఇంటి భాగోతం సినిమాలకు పనిచేశారు. అనంతరం దర్శకుడు జంథ్యాలతో ఏర్పడిన పరిచయం చాలా చిత్రాలకు పనిచేసేలా చేసింది. ఆయన శైలిని ఇ.వివి. తన సినిమాలకు ఉపయోగించుకున్నాడు.
పలు కథలు రాసుకున్న ఆయన శైలిని చూసి విన్నవారంతా నవ్వుకునేవారు. ఆ నవ్వులో అర్థాలు చాలా వున్నాయని ఇవివి గ్రహించేసరికి సంవత్సరాలు గడిచాయి. ఆఖరికి నటుడు అశోక్ కుమార్ విని ఆయన నచ్చి ఇవివికి అవకాశం ఇచ్చారు. ఆయన రామానాయుడు గారి మేనల్లుడు. అందుకే మొదట చెవిలో పువ్వు సినిమాను రాజేంద్రప్రసాద్ తీశారు. అది ప్లాప్ అయింది. ఆ తర్వాత కొంతకాలం కష్టాలు పడ్డ ఇవివి. గురించి తెలిసి మరలా రామానాయుడు ప్రేమ ఖైదీ సినిమాకు అవకాశం ఇచ్చారు. అది పెద్ద హిట్ అయింది. అప్పటినుంచి మొదట్లో కథలు విని నవ్వుకున్న వారంతా ఆయన డేట్స్ కోసం వచ్చారు. కానీ ఆచితూచి అడుగులువేస్తూ వేరే నిర్మాతలతో పలు సినిమాలు తీశారు. చిరంజీవి, వెంకటేష్‌తోపాటు పవన్ కళ్యాణ్‌తో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి తీశారు. నరేష్‌తో జంబలకిడి పంబ చేసి ట్రెండ్ సృష్టించారు. ఇలా వైవిధ్యమైన సినిమాలు చేసిన ఆయన తన కుమారులు నరేష్, రాజేష్‌తోనూ కలిపి నువ్వంటే నాకిష్టం తెరకెక్కించారు. తన కథల్లో నవ్వునే పెద్ద పీటగా వేసిన ఆయన దగ్గర పలువురు రచయితలుగా వేగ్నేశ సతీష్ వంటివారు ఎందరో పనిచేశారు. తెలుగు తెరపై చెరని ముద్ర వేసిన ఆయన కేన్సర్ బారిన పడి మృత్యు వాత పడ్డారు.