శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (11:19 IST)

పరప్పణ అగ్రహార జైలుకు రాగిణి ద్వివేది - సీసీబీ కస్టడీకి సంజనా

కన్నడ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం ఓ కుదుపు కుదిపింది. ఈ వ్యవహారంలో ఇద్దరు నటీమణులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఇప్పటికే అరెస్టు చేసింది. వీరిలో రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు ఉన్నారు. అయితే, రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆమెను బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు. 
 
మరో నటి సంజన గల్రాని, రాహుల్, ప్రశాంత్‌ రంకా, లూమ్‌ పెప్పర్, నియాజ్‌లను వీడియో కాన్ఫరెన్స్‌లో కోర్టులో హాజరు పరిచారు. సంజనకు మినహా మిగతా వారికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. నటి సంజనకు 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు. సంజనను మరింతగా ప్రశ్నించాల్సి ఉన్నందున కస్టడీని పొడిగించినట్లు సీసీబీ పోలీసులు తెలిపారు. 
 
హీరోయిన్లు రాగిణి, సంజన, ఇతర నిందితులు విచారణలో వెల్లడించిన సమాచారం ప్రకారం సీసీబీ పోలీసులు అనుమానితుల జాబితాను తయారు చేసింది. ఇందులో నటులతో పాటు రాజకీయ నేతల పుత్రులు, ప్రముఖ కుటుంబాల వ్యక్తులూ ఉన్నట్లు తెలిసింది. 
 
వీరందరికీ విచారణకు రావాలని వారికి నోటీసులు పంపే అవకాశాలు ఉన్నాయి. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేల సన్నిహితులు, వ్యాపారవేత్తల పుత్రులు కూడా జాబితాలో ఉన్నారు. అనేకమంది ప్రముఖులు తాము నిర్వహించే డ్రగ్స్‌ పార్టీల్లో పాల్గొనేవారని రాగిణి, సంజనలు విచారణలో వెల్లడించి తేనెతుట్టెను కదిపారు.