చిత్రపురి కాలనీ తరహాలోనే ఫిల్మ్ నగర్ క్లబ్ లుకలుకలు! (ఫోకస్)
సినిమారంగంలో పనిచేస్తున్న 24 క్రాఫ్ట్‌ల వారికి చిత్రపురికాలనీ గురించి చెప్పక్కర్లేదు. ఇక్కడున్న రాజకీయాలు ఎక్కడాలేవు. నిధులు దుర్వినియోగం, సభ్యత్వాలలో లుకలుకలు, ఇళ్లు కేటాయింపుల్లో గడబిడలు చాలా వున్నాయి. అవన్నీ ఇప్పుడున్న కమిటీ కోర్టులో కేసులను ఎదుర్కొంటుంది. తాజాగా ఆ కోవలోనే ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ (ఎఫ్ఎన్ సి సి) కూడా చేరిందని తెలుస్తోంది. అసలు ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ రూల్స్‌ను ఫాలో అయి చిత్రపురి కాలనీ కమిటీ ఆగడాలు చేస్తుందనే టాక్ కూడా వుంది.
ఫిలిం రంగంలో పనిచేసే వారికి కాస్త ఆటవిడుపుగా కల్చరల్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. డివిఎస్ రాజు హాయంలో ఎన్టీఆర్ సహకారంతో ఏర్పాటైన క్లబ్ ఇది. మొదట్లో కేవలం ఫిలిం నగర్ లో ప్లాట్లు పొందిన వారి కోసమే అన్నట్లు ఏర్పాటైంది. అక్కడ వినోదకార్యక్రమాలు, టైంపాస్ కార్యక్రమాలు జరుగుతుండేవి. దానితో మెంబర్ల వారసులుకూడా సభ్యులుగా మారాయి. ఆ తర్వాత కాల మహిమ వల్ల రాజకీయనాయకులు, రియల్ ఎస్టేట్, పబ్లిక్ స్కూల్ యాజమానులు, పోలీసు అధికారులకు కూడా సభ్యత్వం ఇచ్చేశారు. ఎంతమందికి సభ్యత్వం వున్నా దాన్ని వెనకనుంచి నడిపించేది ఓ బలమైన వర్గం అనేది బహిరంగ రహస్యమే.
అయతే ఇక్కడ ఓ తిరకాసు కూడా వుంది. క్లబ్ నాయకత్వం 2008 తరువాత నుంచి సభ్యత్వాలు ఇచ్చిన వారి దగ్గర నుంచి ఓటుహక్కు లేకుండా వారిచేత రాయించుకున్నారు. ఓటింగ్ వున్న వారు 2500… ఓట్లు లేని సభ్యులు 2000 మంది. ముందు జాగ్రత్తగా రాసుకున్న ఒప్పందాలు ఇప్పుడు క్లబ్ నిర్వాహకులకు బాగా ఉపయోగపడుతున్నాయి.
అయితే కొందరు ఫిలింనగర్ క్లబ్ వ్యవహారాలు సరిగ్గా లేవు అంటూ ప్రసన్న కుమార్ గతంలోనే కోర్టులో వేసిన కేసు ఇంకా విచారణ దశలోనే వుంది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. తమకు ఓటు హక్కు ఇవ్వాల్సిందే. బైలా మార్చాలనే డిమాండ్ లు వినిపిస్తున్నాయి. ఇదిలా ప్రస్తుతం అధ్యక్షుడిగా వున్న ఆదిశేషగిరి రావు నే మరలా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. కానీ దగ్గుబాటి సురేష్ బాబు కూడా తాను రంగంలోవున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. దాంతో పెద్దలు కూర్చుని సురేష్ బాబుకు వచ్చేసారి అవకాశం ఇవ్వడానికి, ఈసారి కూడా ఆదిశేషగిరి రావు నే రంగంలోకి దింపడానికి ఒప్పించారు. ముళ్లపూడి మోహన్ ను ప్రధాన కార్యదర్శిగా పోటీకి దింపుతారు. ప్రస్తుతం కార్యదర్శిగా వున్న కేఎస్ రామారావు ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం వుందని తెలుస్తోంది.
బైలాస్‌ను మార్చేస్తున్నారు
ఇక చిత్రపురి కాలనీ పరిస్థితి కూడా అలానే వుంది. సినిమారంగంలో పనిచేసేవారు కాకుండా బయట వ్యక్తులకు సభ్యత్వం ఇచ్చి ఇండ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలున్నాయి. సి.కళ్యాణ్, శ్రీనివాస్ వంటి వారు ఈ విషయంలో కోర్టులో కేసు కూడా వేశారు. కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లు ప్రభుత్వం కమిటీ కూడా తేల్చిచెప్పింది.
ఇదిలావుండగా, ఈనెలాఖరులో చిత్రపురికాలనీ జనరల్‌బాడీ సమావేశం ఏర్పాటు కాబోతోంది. అందులో ప్రస్తుత కమిటీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. వారికి ఓ రాజకీయపార్టీ అండకూడా వుంది. దానిమేరకు ప్రస్తుతం వున్న బైలాస్‌ను మార్చేదిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఎటువంటి గొడవలు జరగకుండా భారీ పోలీసుబందోబస్తు ఏర్పాటు చేయడానికి మణికొండకుచెందిన ప్రధాన పార్టీ నాయకుడు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సో.. సినిమారంగంలో వున్న అసోసియేషన్‌లు అన్నీ కలగూరగంపలా తయారయ్యాయని పలువురు విమర్శిస్తున్నారు.