తృటిలో పాముకాటు నుంచి తప్పించుకున్న బస్సు డ్రైవర్
పాములు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణం అయింది. తాజాగా ఓ బస్సు డ్రైవర్ తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా జయపుర గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రోజూలానే ఆ డ్రైవర్ బస్సును స్టార్ట్ చేశాడు. సగం దూరం కూడా వెళ్లింది బస్సు. ఆ తర్వాత ఒక ప్రాంతం దగ్గరలో బ్రేక్ వేద్దామని.. పెడల్‌పై కాలు వేయబోతుండగా.. ఓ నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది.
దీంతో సదరు డ్రైవర్.. బ్రేక్ వేయకుండా ఇంజిన్ ఆఫ్ చేసి.. చాకచక్యంగా బస్సును స్లో చేశాడు. అనంతరం ప్రయాణీకులందరినీ కిందకు దింపి ఆ పామును ఓ కర్ర సాయంతో బయటికి తీశాడు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.