సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (09:11 IST)

రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు సమీపంలో అగ్నిప్రమాదం... ఎక్కడ?

Superstar Rajinikanth  Coolie look
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త "కూలీ" చిత్రం షూటింగ్ విశాఖపట్టణంలో జరుగుతుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పనులు విశాఖ కంటైనర్ టెర్మినల్ సమీపంలో గత కొన్ని రోజులుగా చిత్రీకరిస్తున్నారు. అయితే, షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి ఓ నౌక వద్ద మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. 
 
విశాఖ బీచ్ రోడ్డులోని కంటైనర్ టెర్మినల్ వద్ద చిత్రీకరణ జరుగుతుండగా, ఓ కార్గో షిప్ లిథియం అయాన్ బ్యాటరీల లోడుతో పోర్టు వద్దకు వచ్చింది. ఆ నౌక వద్ద మంటలు చెలరేగడంతో కూలీ సెట్స్‌పై ఆందోళన నెలకొంది కంటైనర్ టెర్మినల్‌కు చాలా దగ్గరగా షూటింగ్ జరుపుతుండటమే అందుకు కారణంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
కాగా, రజనీకాంత్ హీరోగా యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించే ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సైమన్ అనే పవర్‌ఫుల్ గ్యాంగ్‌‍స్టర్ పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున లుక్‌ను ఇటీవలే ఈ చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెల్సిందే. అలాగే, ఇందులో శృతిహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు ఇతర పాత్రలను పోషిస్తున్నారు.