శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (20:06 IST)

బెయిల్ నిరాకరించిన కోర్టు - చంచల్‌గూడ జైలుకు శిల్పా చౌదరి

అధిక వడ్డీ ఆశ చూపి అనేక మంది సినీ సెలెబ్రిటీల వద్ద కోట్లాది రూపాయల అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేసిన కేసులో అరెస్టు అయిన శిల్పా చౌదరికి హైదరాబాద్, ఉప్పర్ వల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. 
 
కిట్టీ పార్టీలు నిర్వహిస్తూ, ఈ పార్టీలకు వచ్చే సినీ సెలెబ్రిటీలకు అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయల మేరకు వసూలు చేసింది. వారికి వడ్డీ ఇవ్వకపోగా అసలు కూడా తిరిగి చెల్లించలేదు. ఇలాంటి వారిలో హీరో మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నారు. 
 
ఈ వ్యవహారంపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరు పరిచారు. పిమ్మట కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు కస్టడీకి కూడా తీసుకుని విచారించారు. అయితే, మరో రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
మరోవైపు, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఉప్పర్ పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించి రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, ఇదే కేసులో శిల్పా చౌదరి భర్తకు మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.