సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (17:23 IST)

నేను హైలైట్ అయ్యానంటే అది రామ్ గొప్పదనం అన్నారు - ఆది పినిశెట్టి

Aadi Pinishetti
Aadi Pinishetti
ప‌వ‌ర్‌ఫుల్ విలన్ గురు పాత్రలో యువ కథానాయకుడు ఆది పినిశెట్టి నటించిన సినిమా 'ది వారియర్'. ఉస్తాద్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించారు. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామ్ పోతినేనితో పాటు ఆది పినిశెట్టి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆది పినిశెట్టితో ఇంట‌ర్వ్యూ.
 
క‌థ‌లు విన్న‌ప్పుడు నో చెప్ప‌డానికి ఇబ్బంది ప‌డ‌తారా?
లేదండీ. నేను నిజాయ‌తీగా, వెంటనే నా అభిప్రాయం చెబుతా. లేదంటే వాళ్ళ టైమ్ వేస్ట్, నా టైమ్ వేస్ట్. నాకు సెట్ అవ్వడానికి, నేను క్యారీ చేయలేనని చెబుతా.  
 
గురు పాత్ర విన్నప్పుడు 'ఎస్' చెప్పడానికి ఎంత సమయం తీసుకున్నారు?
కథ విన్నప్పుడు 'నేను చేయాలి' అనుకున్నాను. అయితే, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. రెండు రోజులు లింగుస్వామి గారితో మాట్లాడి చిన్న చిన్న డౌట్స్ క్లియర్ చేసుకుని వెంటనే ఒప్పుకున్నాను. గురు పాత్రకు ఫ్లాష్‌బ్యాక్‌ ఉండటంతో ప్రేక్షకుల అంత మాట్లాడుతున్నారు ఏమో!
 
గురు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. దర్శకుడు చెప్పినట్టు వెళ్ళారా? మీ నుంచి ఇన్‌పుట్స్‌ ఏమైనా ఉన్నాయా?
నేను ఇంతకు ముందు కమర్షియల్ పెర్ఫార్మన్స్ చేసింది లేదు. నేను క్యారెక్టర్ ప్రకారం తీసుకుని, ఆ క్యారెక్టర్ లో ఉండి... సినిమాటిక్ కమర్షియల్ మీటర్ లో ఉన్నది గురు. మీరు సినిమా చూస్తే... క్లైమాక్స్ తప్ప స్టార్టింగ్ టు ఎండింగ్ చేసే ప్రతి పనిని గురు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నాకు ఈ  మీటర్ కొత్త కాబట్టి లింగుస్వామి గారు చెప్పింది ఫాలో అయిపోయా. మేకప్, గెటప్ విషయంలో కొంత వర్క్ చేశారు. చెవికి దిద్దు పెట్టుకోవడంతో పాటు చిన్న లెన్స్ వాడను. గురును డిఫరెంట్ గా చూపించడం కోసం నేను ఆ వర్క్ చేశాను తప్ప... క్యారెక్టర్ క్రెడిట్ మొత్తం లింగుస్వామి గారిది.      
 
విల‌నిజానికి గ్యాప్ ఎందుకు వ‌చ్చింది?
 'స‌రైనోడు' తర్వాత విల‌న్‌గా చేద్దామ‌న‌ప్పుడు 'అజ్ఞాత‌వాసి' చేశా. అది ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి సినిమా. దాని త‌ర్వాత ఏ క్యారెక్ట‌ర్ వ‌చ్చినా.... దాని కంటే బెట‌ర్‌గా ఉండాల‌ని ఆలోచించా. ది వారియ‌ర్ లో రోల్ విన్న‌ప్పుడు... ఆర్డ‌న‌రీ విల‌న్‌గా కాకుండా, గురుకు ఒక క్యారెక్ట‌రైజేష‌న్ ఉంది. అది నాకు న‌చ్చింది. అందుక‌ని, చేశా.
 
మీరు హీరోగా చేశారు, విలన్ గా చేశారు. ఏది కంఫర్ట్ అనిపించింది?
రెండూ కంఫర్ట్ గా అనిపించాయి. ఆ క్యారెక్టర్స్ ను జనాలు నమ్మేలా వాళ్ళలోకి తీసుకువెళ్ళడం ఛాలెంజ్. హీరోగా చేస్తున్నానా? నాది నెగిటివ్ క్యారెక్టరా? అనే డిఫరెన్స్ నాకు లేదు.  
 
రామ్ స్పైనల్ ఇంజ్యూరీ కారణంగా మూడు నెలలు షూటింగ్ వాయిదా వేశారు. ఆ సమయంలో మీరు టెన్షన్ ఏమైనా పడ్డారా?
అప్పుడు వేరే సినిమాలు ఉన్నాయి. వాళ్ళు, నేను అంద‌రం టెన్ష‌న్ ప‌డ్డాం. నేను మన నిర్మాతలను టెన్షన్ పెట్టాను. కొన్ని మన చేతుల్లో ఉండవు. నేచురల్ గా జరిగిన విషయాలను మనం ఏమీ చేయలేం. రామ్ ఇంజ్యూరీ కూడా చిన్నది కాదు. వెంటనే షూటింగ్ చేస్తే గాయం పెద్దది కావచ్చు. ఒకవేళ ఆ టైమ్ లో నాకు ఇంజ్యూరీ అయితే వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు కదా! మనం ఏమీ చేయలేం. టెన్షన్ పడినా చివరకు కంప్లీట్ చేశాం. 
 
ఇద్దరు హీరోల మధ్య సినిమాలో ఫైట్ ఉంటే... షూటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది?
క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ సాంగ్ షూటింగ్ లా జ‌రిగింది. ఆ ఫైట్‌లో రామ్‌, నాకు మ‌ధ్య కెమిస్ట్రీ చాలా బావుంటుంది. మా కోఆర్డినేష‌న్ బావుంటుంది. మేమిద్దరం ఫైట్ చేస్తుంటే సాంగ్ లో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉందని డైరెక్టర్ గారు ఒక రోజు చెప్పారు. ఇద్దరు హీరోలు సింక్ లో ఉన్నప్పుడు అలా కుదురుతుంది. రామ్ గ్రేట్ పెర్ఫార్మర్. గ్రేట్ డ్యాన్సర్. డ్యాన్సర్‌కు ఫైట్‌లో సింక్ కుదురుతుంది. నేను అంత గ్రేట్ డ్యాన్సర్ కాకపోయినా మాకు సింక్ కుదిరింది. మేం కష్టపడి ఏమీ చేయలేదు. ఈ క్రెడిట్ అన్బు అరివు మాస్టర్లదే.  
 
మీకు రెండు భాషల్లో ఫాలోయింగ్ ఉండటం ప్లస్ అనుకుంటున్నారా?
 మీరు అలా అనుకుంటున్నారా? తమిళ వాళ్ళు నేను తెలుగు వాడిని అనుకుంటున్నారు. తెలుగు వాళ్ళు తమిళోడిని అనుకుంటున్నారు. అది పక్కన పెడితే... ఇప్పుడు ప్రేక్షకులు భాషను పట్టించుకోవడం మానేశారు. మంచి కథ, సినిమా, పెర్ఫార్మన్స్ వస్తే ఆదరిస్తున్నారు. మనకు ఎగ్జాంపుల్స్‌ ఉన్నాయి. భాషతో సినిమాకు సంబంధం లేకుండా సినిమాను సెలబ్రేట్ చేస్తున్నారు.  
 
 మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' అనుకోవచ్చా?
నాకు అయితే సేమ్ లైఫ్. పెళ్ళికి ముందు 'మోడ్రన్ లవ్ హైదరాబాద్'లా ఉండేవాళ్ళం ఏమో!  పెళ్లి తర్వాత, ఇప్పుడు చాలా బావున్నాం. నాకూ, తనకూ మమ్మల్ని అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అంతా హ్యాపీగా ఉంది.
 
మీ నాన్నగారు 'ది వారియర్' చూసి ఏమన్నారు?
నాన్నగారు (రవిరాజా పినిశెట్టి) ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ చెప్పరు. నాలో నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. యాస కొంచెం బాగుంటే బాగుంటుందన్నారు. కొన్ని సన్నివేశాలను నా పెర్ఫార్మన్స్ బాగుంది, నేను హైలైట్ అయ్యానంటే అది రామ్ గొప్పదనం అని చెప్పారు. అతను కొంచెం తగ్గడం వల్ల నాకు ఇంత పేరు వచ్చిందన్నారు.