గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (12:29 IST)

టాలీవుడ్‌పై కరోనా పంజా .. రిపబ్లిక్.. ఇష్క్ రిలీజ్ వాయిదా!

తెలుగు చిత్రపరిశ్రమలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో అనేక చిత్రాల షూటింగులను రద్దు చేస్తున్నారు. అలాగే, విడుదల కావాల్సిన చిత్రాలు కూడా వాయిదాపడుతున్నాయి. ఈ క్రమంలో దేవ కట్టా దర్శకత్వంలో మెగా కాంపౌడ్ హీరో సాయితేజ్ నటించిన తాజా చిత్రం 'రిపబ్లిక్'. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా రూపొందింది. 
 
ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు - రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషించారు. రమ్యకృష్ణ పాత్ర చాలా పవర్ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
 
ఈ సినిమాను జూన్ 4వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ రోజున థియేటర్లకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం విపరీతంగా ఉండటంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. 
 
వచ్చేనెలలో థియేటర్లకు రానున్న కొన్ని సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. ఆ బాటలోనే 'రిపబ్లిక్' నడిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.
 
మరోవైపు, కరోనా ప్రభావం ‘ఇష్క్- నాట్ ఎ లవ్ స్టోరీ’ మూవీపై పడింది. సినిమా విడుదల వాయిదా పడింది. మంగళవారం నుంచి తెలంగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. సినీ ఇండస్ట్రీ ప్రతినిధులూ థియేటర్లను మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు తేజ ప్రకటించారు. వాస్తవానికి శుక్రవారం (23వ తేదీ) నుంచి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
 
అయితే, రెండు వారాలుగా కరోనా పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ఇలాంటి సమయంలో సినిమాను విడుదల చేస్తే బాగుండదని, నైతికంగా సరైన నిర్ణయం కాదని తేజ చెప్పుకొచ్చారు. త్వరలోనే కొత్త విడుదల తేదీతో అందరి ముందుకు వస్తామని చెప్పారు. కరోనా తీవ్రతను తాము అర్థం చేసుకోగలమని, అందుకే ప్రజల భద్రత, సాయానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
 
పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నాయని, ఈ నేపథ్యంలోనే ప్రజల భద్రతకు గౌరవం ఇచ్చి సినిమాను వాయిదా వేశామని చెప్పారు. కొత్త తేదీ ప్రకటించేదాకా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఇంట్లోనే క్షేమంగా ఉండాలని తేజ విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్, ఇతర బాధితులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.