మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

నగదు అక్రమ రవాణా కేసు : అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కన్నడ నటి రాధిక

నగదు అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటి రాధికా కుమార స్వామి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ కేసులో సోదరుడు రవిరాజ్‌తో కలిసి శుక్రవారం సీసీబీ విచారణకు హాజరైన ఆమె, ఆ రోజు రాత్రి నుంచి కనిపించడం లేదన్న వార్త కలకలం రేపుతోంది. 
 
మరోవైపు, మాజీ మంత్రి మురుగేశన్ నిరాణిని రాధిక కలిసినట్టుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, అవి పాత ఫొటోలు అని పోలీసులు చెబుతున్నారు.
 
కాగా, ఈమె ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఆరోపణలపై గతేడాది డిసెంబరులో యువరాజ్ (52) అలియాస్ స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసులు జరిపిన విచారణలో ఆరెస్సెస్ కార్యకర్తగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడినట్టు తేలింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు నటి రాధిక కుమారస్వామి, యువరాజ్ మధ్య రూ.75 లక్షల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. దీంతో తాజాగా, ఆమెను విచారించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు.
 
యవరాజ్ తనకు గత 17 ఏళ్లుగా తెలుసని, ఆయన తమ కుటుంబ జ్యోతిష్యుడని ఇటీవల రాధిక చెప్పుకొచ్చారు. తన కెరియర్, జీవితం, తన తండ్రి మరణం గురించి ఆయన చెప్పినవన్నీ నిజమయ్యాయని పేర్కొన్నారు. గతేడాది అతడి అరెస్టు విషయం తెలిసి షాకయ్యానని పేర్కొన్నారు. 
 
గతేడాది డిసెంబరు 16న యువరాజ్ నివాసంపై దాడులు చేసిన సీసీబీ అధికారులు రూ. 91 కోట్ల విలువైన 100 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. పైగా, యువరాజ్‌కు సొంత ప్రొడక్షన్ కంపెనీ ఉందని, ఓ చారిత్రక సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని తనను అడిగారని రాధిక తెలిపారు. 
 
తాను వెంటనే అంగీకరించానని చెప్పారు. దీంతో అడ్వాన్స్‌గా రూ.15 లక్షలు పంపిస్తానని చెప్పి తన ఖాతాలోకి బదిలీ చేశారని విచారణ అనంతరం పేర్కొన్నారు. మిగతా సొమ్ము గురించి ప్రశ్నించగా, యువరాజ్ బావమరిది ఖాతా నుంచి మరో రూ.60 లక్షలు తన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయినట్టు రాధికా కుమారస్వామి వివరించారు.  
 
అయితే, యువరాజ్ అలియాస్ స్వామి సేవాలాల్‌ను అరెస్ట్ అనంతరం పోలీసులు జరిపిన దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. భారీ బడ్జెట్, పెద్ద ప్రొడక్షన్‌లలో నటించే అవకాశం కల్పిస్తానంటూ 8 మంది యువ కథానాయికలు, ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఆయన పలుమార్లు కలిసినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, జ్యోతిష్యం పేరుతో పలువురు దర్శకులు, నిర్మాతలు, నటులను అతడు వంచించినట్టు కాల్‌డేటా ఆధారంగా గుర్తించారు.