శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Modified: సోమవారం, 8 అక్టోబరు 2018 (13:58 IST)

గిన్నిస్ బుక్‌లోకి ఎక్కనున్న కౌషల్.. కారణమేంటో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 ఎన్నో వివాదాలతో వాడివేడిగా ముగిసింది. దాదాపు సీజన్ మధ్యలోనే విజేతగా ఎవరు నిలవబోతున్నారనేది స్పష్టంగా తెలిసిపోయింది. దీనికి కారణం బిగ్ బాస్ షో అనేది ప్రేక్షకుల ఓట్ల ద్వారా నడిచే కార్యక్రమం. ఒక్కో వారం నామినేషన్లలో ఉన్నవారిలో ఎవరెవరు బయటకు వెళ్తారో, అలాగే ఎవరెవరు ఇంట్లో కొనసాగుతారో వీరి ఓట్లను బట్టే జరుగుతుంది. 
 
ఇక కౌషల్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడటం, వారు ఓట్లు వేయడమే కాకుండా సోషల్ మీడియాలో, బయటా భారీ స్థాయిలో ప్రచారం చేయడం, మిగిలిన హౌస్‌మేట్లపై ట్రోలింగ్‌లు చేయడం వంటి పనులతో భారీ మెజార్టీ ఓట్లను కౌషల్‌కు తెచ్చి పెట్టారు. 
 
తొలి సీజన్లో విన్నర్ అయిన శివబాలాజీ, రన్నర్ ఆదర్శ్‌కు ఎన్నెన్ని ఓట్లు వచ్చాయనేది ఫినాలె రోజున వెల్లడించారు. కానీ ఈ సారి ఓట్ల సంఖ్యను వెల్లడించలేదు. దీనికి కారణం ఇప్పటి దాకా ఏ రియాల్టీ షోలో ఎవరికీ రానన్ని ఓట్లు వచ్చాయట. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ వారి నుండి ఈ విషయంగా కౌషల్‌కు కాల్ వచ్చిందట. దీంతో కౌషల్ పేరును గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరుస్తున్నట్లు ఆయన తెలిపారని సమాచారం. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
 
ఇకపోతే ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయం షో నిర్వాహకులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేటంతగా ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.