కోలీవుడ్ దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తాడా?
సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పెయాలనుకోవడం మామూలే. ఈ ధోరణి తమిళ సినిమా రంగంలో మరీ ఎక్కువ. ఇప్పుడు మరో యువ నటుడు రాజకీయాల్లో ఎంట్రీ కోసం తహ తహ లాడుతున్నట్టు తెలుస్తోంది. తమిళనాట ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళపతి విజయ్ తన అభిమాన సంఘం కీలక నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో విజయ్ అభిమానుల్లో చర్చ నడుస్తోంది.
విజయ్ రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తిరుచ్చి, మధురైలలో కాబోయే సీఎం విజయ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. తమిళనాట కళైంజర్ తర్వాత నువ్వే అంటూ విజయ్‌ను ఆకాశానికెత్తే పోస్టర్లు అంటించారు. అప్పట్లో ఇదో పొలిటికల్ దుమారం రేపింది.
ఇప్పుడు విజయ్ తన అభిమాన సంఘాల నాయకులతో విజయ్ భేటీ కావడంతో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ భేటీలో పోస్టర్ల అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాజకీయ పోస్టర్లు, ప్రకటనల జోలికి వెళ్ళొద్దని అభిమానులకు విజయ్ సూచించినట్టు సమాచారం. పొలిటికల్ ఎంట్రీపై అభిమానులతో చర్చించిన తర్వాతే ప్రకటన ఉంటుందని విజయ్ చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక దక్షిణ తమిళనాడులోని మధురై, దిండిగల్, తిరునల్వేలితో సహా పలు జిల్లాల్లో అధ్యక్షులతో ఆయన భేటీ అయ్యారు. ఈ కార్యక్రమం మరో వారం రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ ప్రస్తుతం తమిళనాట వినిపిస్తోంది.
కాగా కోలీవుడ్‌లో విజయ్‌కి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విజయ్.. మక్కల్ ఇయక్కమ్ పేరుతో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ మక్కల్ ఇయక్కమ్‌నే రాజకీయ పార్టీగా మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తారా..? లేక ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తారా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.