సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (15:40 IST)

కుమారుడి మరణంతో గొల్లపూడి కుంగిపోయారు : కోట శ్రీనివాస రావు

కుమారుడు మరణంతో గొల్లపూడి మారుతీ రావు కుంగిపోయారనీ ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు అన్నారు. అనారోగ్య కారణంగా గొల్లపూడి గురువారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయంతెల్సిందే. గొల్లపూడి మృతిపట్ల తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేసింది. తెలుగు సినీరంగానికి ఆయన అందించిన విశేషమైన సేవలను గుర్తుచేసుకుంటూ ఆ ప్రతిభాశాలికి నివాళులర్పిస్తోంది. 
 
ఈ సందర్భంగా గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల సీనియర్ నటుడు, సన్నిహితుడు కోట శ్రీనివాసరావు స్పందిస్తూ ఆయన అస్తమయం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఆయన కుమారుని ఆకస్మిక మరణం బాగాకుంగదీసిందన్నారు. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన భార్యకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలంటూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక‍్తంచేశారు.
 
అలాగే, హీరో నాని స్పందిస్తూ, తనకు ఇష్టమైన నటులలో గొల్లపూడి మారుతీ రావుగారు ఒకరన్నారు. ఆయన మాట్లాడేతీరు, నటించిన తీరు ఆకట్టుకుంటుందని, ఆయన సాన్నిహిత్యం మరువలేనిదంటూ ట్వీట్ చేశారు. 
 
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందిస్తూ, హ్యాపీడేస్‌ సినిమాకు ముందు ఒక చిన్న సినిమాలో ఆయనతో కలిసి నటుడు కమ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాననీ, ఆ సందర్భంగా ఆయన మార్గదర్శకత్వం, సలహాలు ఎప్పటికీ తనతోనే శాశ్వతంగా ఉంటాయంటూ గొల్లపూడి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.