మెగా హీరోలనే నమ్ముకున్న టాలీవుడ్ దర్శకుడు?!

krish
మోహన్| Last Updated: మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:44 IST)
తెలుగు చలనచిత్ర రంగంలో ప్రతిభను చాటిన దర్శకులలో జాగర్లమూడి క్రిష్ ఒకరు. ఇతని చిత్రాలు వైవిధ్యంగా, సందేశాత్మకంగా కొనసాగుతాయి. కానీ ఇప్పుడు అతని ప్రతిభకు తగినట్లుగా హిట్స్ రాకపోవడం నిరాశపరుస్తోంది. నిర్మాతగానే కాకుండా దర్శకునిగా కూడా విఫలమవుతున్నాడు. అతను నిర్మించిన అంతరిక్షం సినిమా తగిన ఫలితాలను రాబట్టలేదు. దర్శకునిగా వ్యవహరించి తీసిన "ఎన్టీఆర్ బయోపిక్" భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ హిట్ కొట్టలేకపోయింది.

ఈ సినిమా వలన అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. దీంతో క్రిష్ తదుపరి ఎలాంటి సినిమా తీయబోతున్నారని అభిమానులలో ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా విభిన్న కథనాలతో ప్రేక్షకుల మనస్సును ఆకట్టుకునే క్రిష్... బాలయ్య కోరిక మేరకు 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' రెండు భాగాలుగా తీసి విఫలమయ్యాడు. దానికితోడు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు.

క్రిష్ దర్శత్వం వహించిన "మణికర్ణిక" చిత్రం విషయంలో కూడా కంగన రనౌత్‌తో విభేదాలు వచ్చాయి. క్రిష్ ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన రచయితల బృందంతో కలసి అద్భుతమైన కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రంతో తాను దర్శకుడిగా పుంజుకోవాలని క్రిష్ భావిస్తున్నట్లు సమాచారం.

క్రిష్ ఎక్కువగా మెగా హీరోలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ లేదా అల్లుఅర్జున్‌లలో ఎవరో ఒకరితో ఈ చిత్రం చేయాలని క్రిష్ భావిస్తున్నాడట. ఇద్దరూ ఇప్పుడు బిజీగా ఉన్నారు. క్రిష్‌కు రామ్‌చరణ్ ఓకే చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. "ఆర్ఆర్ఆర్" షూటింగ్ పూర్తయ్యేది 2020లో. ఇక అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ చిత్రంలో బిజీ కాబోతున్నాడు. క్రిష్ ఎన్నాళ్లు వేచి ఉంటాడో చూడాలి.దీనిపై మరింత చదవండి :