మైక్ టైసన్‌తో లైగర్ టీమ్... ఛార్మీ, అనన్య పాండే జోరు!
బాక్సింగ్ ఇతివృత్తంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం అవుతున్న లైగర్ సినిమా, రిలీజ్ కి ముందే హాట్ హాట్ గా మారుతోంది. ఈ సినిమాలో నటిస్తున్న తారాగణం ఒక ఎత్తు అయితే, అందులో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ఉండటం మరో ఎత్తు. అతనికి ఛార్మీ, అనన్యా పాండే జల్సా చేయడం మరో హాట్ సీన్.
పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా లైగర్. ఇది బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను గతంలో మత్తు పదార్ధాలు వాడాడని, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడని వార్తలకెక్కాడు. ఇపుడు ఈ సినిమాలో ఎంచక్కా, నిర్మాత ఛార్మి, హీరోయిన్ అనన్య పాండే తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతూ కనిపించాడు.
లైగర్ సినిమా తాజా షెడ్యూల్ అమెరికాలో మొదలైంది. ఈ షూట్‌లో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే షాట్ గ్యాప్ లో మైక్ టైసన్‌తో చిత్ర బృందం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అమెరికా షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండ, మైక్‌టైసన్‌పై ముఖ్య పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నారు. ఇందులో మైక్‌టైసన్ జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో తీయించుకున్న ఓ ఫొటోను విజయ్ దేవరకొండ తన ట్విట్టర్‌లో పెట్టాడు.
టైసన్‌తో గడుపుతున్న ప్రతి నిమిషాన్ని గొప్ప జ్ఞాపకాలుగా భద్రపరచుకుంటున్నా. ఆయన ప్రేమకు నిర్వచనం. ఈ ఫొటో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. లైగర్ వర్సెస్ లెజెండ్ అంటూ ఫొటోపై క్యాప్షన్ పెట్టాడు. ఇక మైక్ టైసన్‌తో పాటు పూరీ, ఛార్మి, అనన్య పాండే సరదాగా మైక్ టైసన్‌తో కలిసి ఫొటోలు దిగారు. ఇవి వైరల్‌గా మారి, టీం అంతా ఫుల్ జోష్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ పతాకాలపై కరణ్‌జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మి, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. విడుదలకు ముందే వీరి ఫోటోల విడుదల హాట్ హాట్ గా మారింది.