అప్పుడు నచ్చిన మీడియా.. ఇప్పుడు నచ్చలేదా..?
సినిమాని సరిగా తీయడం రాదు కానీ... మీడియాపై సెటైర్స్ వేసేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు అలాగే చేసారు నిర్మాత మధుర శ్రీధర్. ఆయన నిర్మించిన తాజా చిత్రం దొరసాని. ఈ సినిమా ద్వారా ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమాకి సినీ విమర్శకులు రేటింగ్ సరిగా ఇవ్వలేదు అంటూ నిర్మాత మధుర శ్రీధర్ తెగ బాధపడిపోతున్నారట.
ప్రేక్షకుల కోసం సినిమా తీయాలో... సినీ విమర్శకుల కోసం సినిమా తీయాలో అర్ధం కావడం లేదు. మా జీవితాలు రివ్యూ రైటర్స్ చేతిలో ఉన్నాయి అంటూ కామెంట్ చేసారు. ఇటీవల కాలంలో రిలీజైన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా, మల్లేశం చిత్రాలు చిన్న సినిమాలే. వాటి గురించి మీడియా పాజిటివ్ గానే రాసింది. ఎందుకు రాసింది అందులో కంటెంట్ ఉంది కాబట్టి. పెళ్లిచూపులు సినిమాకి మీడియా సపోర్ట్ చేయడం వలనే పెద్ద సినిమా అయ్యింది.
ఆ సినిమాకి నిర్మాతల్లో మధుర శ్రీధర్ ఒకరు. అప్పుడు మీడియా బాగా సపోర్ట్ చేసింది అంటూ అభినందించారు. ఇప్పుడు దొరసాని విషయంలో వాస్తవం రాస్తే... అది చేదుగా ఉన్నట్టుంది. ఇలా అయితే.. ఎలా శ్రీధర్ గారు. కంటెంట్ ఉంటే ఆ సినిమాని ఎవరూ ఆపలేరు. ఈ విషయం తెలుసుకుని మీడియాపై ఫైర్ అవ్వడం పక్కనపెట్టి... కంటెంట్ ఉన్న సినిమా తీయండి. పెద్ద విజయాన్ని సాధించండి అంటున్నారు మీడియా జనం.