ప్రభాస్ సినిమాకి 'మహానటి' టెక్నీషియన్స్ డానీ సాంచెజ్-లోపెజ్, మిక్కీ జె. మేయర్
ప్రభాస్, దీపిక పదుకొణె జంటగా ఒక అద్భుతమైన సినిమా అనుభవాన్ని ఇచ్చేందుకు అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సిద్ధమవుతోంది. 'మహానటి'తో తెలుగుచిత్రసీమలోని ప్రతిభావంతులైన దర్శకుల్లో ఒకరిగా కీర్తి ప్రతిష్ఠలు పొందిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ చేయనున్నారు. వైజయంతీ మూవీస్, నాగ్అశ్విన్ కలయికలో వచ్చిన 'మహానటి' పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది. ఆ చిత్రానికి తెర వెనుక హీరోలుగా నిలిచిన ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు ప్రభాస్, దీపిక, నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ కాంబినేషన్ చిత్రానికి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. వారిలో ఒకరు సినిమాటోగ్రాఫర్ డానీ సాంచెజ్-లోపెజ్ కాగా, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె. మేయర్.
ఈ విషయాన్ని శుక్రవారం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వైజయంతీ మూవీస్ సంస్థ ప్రకటించింది. "Proudly presenting our heroes behind the screen. Welcome @dancinemaniac and @MickeyJMeyer onboard our #PrabhasNagAshwin Project." అంటూ ట్వీట్ చేసింది.
'మహానటి' చిత్ర విజయంలో మిక్కీ జె. మేయర్, డానీ సాంచెజ్-లోపెజ్ పోషించిన పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆ ఇద్దరినీ ఈ చిత్రానికి ఎంచుకున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
డ్రీమ్ క్యాస్ట్ అనదగ్గ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపిక పదుకొణె లాంటి నేటి భారతీయ సినిమా బిగ్గెస్ట్ స్టార్స్, సినీ మాంత్రికుడు అనదగ్గ నాగ్ అశ్విన్ ('మహానటి' ఫేమ్) లాంటి డైరెక్టర్ కలయికలో రానున్న సినిమా కావడంతో ఇదివరకెన్నడూ చూడని ఓ సెల్యులాయిడ్ దృశ్య కావ్యాన్ని సినీ ప్రియులు ఆశించవచ్చు. 2022లో ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.