1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 జులై 2024 (08:28 IST)

కల్కి చిత్ర బృందానికి హ్యాట్సాఫ్.. ప్రిన్స్ మహేశ్ బాబు!

Mahesh Babu
నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఇటీవల విడుదలై కనకవర్షం కురిపిస్తుంది. అలాగే, ఈ చిత్రం మేకింగ్‌పై సినీ రంగం నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. విడుదలైన రోజు నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్రబృందాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వారి అభిప్రాయాన్ని తెలుపగా.. తాజాగా స్టార్‌ హీరో మహేశ్‌ బాబు ఎక్స్ వేదికగా కల్కి టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. తనదైన శైలిలో మూవీపై రివ్యూ ఇచ్చారు. 
 
'కల్కి ఓ అద్భుతం.. జస్ట్‌ వావ్‌. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కు హ్యాట్సాఫ్‌. ప్రతి ఫ్రేమ్‌ కళాఖండంలా ఉంది. అమితాబ్‌ బచ్చన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌కు ఎవరూ సరితూగరు. కమల్‌ హాసన్‌ ప్రతి పాత్రకు జీవం పోస్తారు. ప్రభాస్‌ గొప్ప క్యారెక్టర్‌లో చాలా సులభంగా నటించారు. దీపిక ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించారు. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వైజయంతీ మూవీస్‌కు అభినందనలు' అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు దర్శకుడు స్పందిస్తూ.. ధన్యవాదాలు చెప్పారు. 'మీ అభినందనలు అందుకోవడం మా టీమ్‌కు ఆనందంగా ఉంది' అని రిప్లై ఇచ్చారు. నిర్మాణసంస్థ కూడా మహేశ్‌కు థ్యాంక్స్‌ చెప్పింది.
 
ఇకపోతే, 'కల్కి 2898 ఏడీ' విడుదలకు ముందు నుంచే అమెరికాలో ప్రభంజనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన నాగ్‌ అశ్విన్‌ వారితో కలిసి ఈ సినిమా వీక్షించనున్నారు. అమెరికాలోని బిగ్గెస్ట్‌ ఐమాక్స్‌లో శనివారం మధ్యాహ్నం ఆయన ఆడియన్స్‌తో కలిసి కల్కి చూడనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణసంస్థ పోస్టర్‌ విడుదల చేసింది.  
 
మరోవైపు కల్కి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ మూవీ రూ.900 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఇప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో త్వరలోనే ఈ చిత్రం రూ.1000 కోట్లు సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు.