బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (17:55 IST)

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

teja sajja - rana
ఇటీవల దుబాయ్ వేదికగా ఐఫా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో యువ హీరో తేజ సజ్జా, రానాల మధ్య సంభాషణ ఇవుడు వివాదాస్పదంగా మారింది. తేజ సజ్జా, రానాలు తమ అభిమాన హీరోకు క్షమాపణలు చెప్పాలంటూ మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఐఫా వేడుకల్లో రానా చేసిన వ్యాఖ్యలు, వాటికి తేజ సజ్జా ప్రతిస్పందన ఏంటో ఓసారి పరిశీలిస్తే, 
 
ఈ యేడాది సంక్రాంతికి విడుదలైన తేజ సజ్జా నటించిన 'హనుమాన్' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాతో పాటు మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" సినిమా కూడా విడుదలైంది. అయితే, అటు తేజా సజ్జా 'హనుమాన్', ఇటు మహేష్ బాబు 'గుంటూరు కారం' చిత్రాలు పోటాపోటీగా బరిలోకి దిగాయి. కానీ ఇందులో 'హనుమాన్' సినిమా భారీ వసూళ్లూ రాబట్టింది. అయితే ఆ సమయంలో థియేటర్ల కేటాయింపుపై  పెద్ద చర్చే జరిగింది.
 
ఇక ఇప్పుడు హీరో తేజా సజ్జా, హీరో రానా దగ్గుబాటిపై మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందుకు కారణం ఇటీవల వీరిద్దరు ఐఫా వేడుకలలో చేసిన వ్యాఖ్యలే. కొన్ని రోజుల క్రితం జరిగిన ఐఫా వేడుకలలో తేజ సజ్జా, మహేష్ ఇద్దరిని పోలుస్తూ హీరో రానా చేసిన కామెంట్స్ ఇప్పుడు మహేశ్ అభిమానుల కోపానికి కారణమైంది. సంక్రాంతికి విడుదలైన సినిమాల గురించి మాట్లాడుతూ సరదాగా మాట్లాడాడు రానా. 
 
కానీ తమ హీరోను తేజా సజ్జాతో పోల్చడం నచ్చలేదని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. దుబాయ్ వేడుకగా జరిగిన ఐఫా వేడుకలో రానా మాట్లాడుతూ.. 'ఇతడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు. వివాదాలకు దూరంగా ఉన్నాడు. చాలా మృదుస్వభావి.. కోట్లాది మంది హృదయాలను కదిలించేవాడు. లవర్ బాయ్, యాక్షన్ స్టార్.. వన్ అండ్ ఓన్లీ..' అంటూ మాట్లాడుతుండగానే.. 'ఇప్పుడు నా గురించి ఎందుకు బ్రో' అంటూ తేజా సజ్జా సిగ్గుపడిపోయాడు. 
 
దీంతో రానా 'నేను నీ గురించి కాదు మహేష్ బాబు గురించి మాట్లాడుతున్నాను. అయినా తేజ, మహేష్ ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చారు. ఇద్దరూ ఒకే ప్రయాణాన్ని ఎంచుకున్నారు. అయన ఒక సూపర్ స్టార్.. నువ్వు ఒక సూపర్ హిరో.. మీరిద్దరూ సంక్రాంతికి వచ్చారు' అని రానా మాట్లాడుతుండగా.. సంక్రాంతి విషయం పక్కన పెట్టండి.. సెన్సిటివ్ టాపిక్ అంటూ తేజ వ్యాఖ్యానించారు. ఈ వీడియోనే ఇపుడు వైరల్‌గా మారింది. 
 
దీనిపై మహేశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మీరు ఒక్క సినిమా హిట్టు కొట్టారు.. కానీ మహేష్ 25 ఏళ్లుగా సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. అలాంటి హీరోపై వెకిలిగా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని, అందువల్ల తేజ సజ్జా, రానా... మహేశ్ బాబుకు సారీ చెప్పాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.