బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (20:29 IST)

స్త్రీ దేవతలను పూజించడం ఎందుకు? బిడ్డలకు అది నేర్పించండి... మంచు లక్ష్మి బహిరంగ లేఖ

స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మంచు లక్ష్మి బహిరంగ లేఖ రాశారు. దాని సారాంశం... "గతంలో మనం ఎదుర్కొన్న రాక్షస సంఘటనలు మరువలేనివి. అయినా వాటిని మరచి, రేపటి వైపు నడవాలని ప్రయతించే లోపే, ఈ సమాజంలో మళ్ళీమళ్ళీ ఎక్కడో ఒక దగ్గర అలాంటి దుర్మార్గ సంఘటనలే చో

స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మంచు లక్ష్మి బహిరంగ లేఖ రాశారు. దాని సారాంశం... "గతంలో మనం ఎదుర్కొన్న రాక్షస సంఘటనలు మరువలేనివి. అయినా వాటిని మరచి, రేపటి వైపు నడవాలని  ప్రయతించే లోపే, ఈ సమాజంలో మళ్ళీమళ్ళీ ఎక్కడో ఒక దగ్గర అలాంటి దుర్మార్గ సంఘటనలే చోటుచేసుకుంటూ మనం మంచి వైపు నడవాల్సిన దూరం ఇంకా చాలా ఉందని మనకి గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి రాక్షస ఘటనే నా సహనటి అయిన మలయాళ హీరోయిన్ పైన జరిగింది. ఆమె కిడ్నాప్ అయి, ఆమెపై లైంగిక దాడి జరిగిందన్న విషయం తెలిసినప్పటి నుండి ఈ విషయంపై నేను స్పందించాలని అనుకున్నా.. అయినా ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదంటే ఆ ఘటన నుండి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది.
 
ముందు నుండి మన దేశంలో స్త్రీలు.. అయితే వేదాల్లో దేవతలుగా పూజింపబడుతున్నారు, లేదా తలుపు చాటు గృహిణులుగా మిగిలిపోతున్నారు. వారిలో అమ్మలుగా, భార్యలుగా మారినవారు మాత్రమే కొంతలో కొంత గౌరవాన్ని పొందకలుగుతున్నారు. అయితే ఒక స్త్రీకి కావాల్సింది ఈ మాత్రం గౌరవమేనా? ఆడవాళ్ళు రక్షణ అనే మాటకి బాగా దూరంగా ఉన్న ఈ సమాజంలో, ఇలాంటి సమయంలో స్త్రీ మూర్తులుగా, దేవతలుగా లక్ష్మి, పార్వతి, దుర్గా, సరస్వతి, కాళీ వంటి దేవతలను పూజించడం ఎంతవరకు సమంజసం? 
 
మనం ఒకవైపు మన ఆడ కూతుళ్ళని సంఘం కట్టుబాట్ల పేరుతో వారి జీవితాలని నాశనం చేస్తున్నప్పుడు, వరకట్న వేధింపులకి గురిచేస్తున్నప్పుడు, ప్రేమ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు, వారిని శారీరిక ఇబ్బందులకు గురిచేస్తున్నపుడు, సంసార సుఖంలో వారి ఇష్టానికి విలువ ఇవ్వకుండా వారిని ఇబ్బందికి గురి చేస్తున్నప్పుడు, ఆకతాయిలుగా ఆడవారిని ఏడిపిస్తున్నప్పుడు, స్త్రీ మూర్తులుగా దేవతలను పూజించడం ఎంతవరకు సమంజసం?
 
స్త్రీలపై ఇలాంటి అఘాయిత్యాలు మనకేం కొత్త కాదు, ఆడబిడ్డకి లైంగిక వేధింపులు అన్నవి మన జీవితంలో చాలా సహజం అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి "సహజం" అయిపోయింది. నిజానికి ఆడవారిపై జరుగుతున్న దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు, దారుణాలు, కట్టుబాట్ల పేర్లతో వారిని అణిచివేస్తున్న సంఘటనలనలను వింటూనే మనం నిద్ర లేస్తున్నాం. నాతోటి కళాకారుణిపై జరిగిన ఈ దుశ్చర్య విన్న తరువాత నాకు పట్టరానంత కోపం వచ్చింది. అయితే అన్నటికన్నా దారుణం ఏమిటంటే అసలే మృగాళ్ల ఆటవిక చర్య కారణంగా ఇబ్బందికి గురయిన ఆ మహిళ పేరును కూడా మీడియా బయట ప్రపంచానికి అనుకోకుండా తెలిసేలా చేయడం నన్ను మరింత బాధ పెట్టింది.
 
నేటితరం స్త్రీలమైన మేము మా శరీరం మాకు తప్ప అందరికి సొంతం అనే ఆటవిక సమాజంలో బతుకుతున్నాం. ఇప్పుడు మేము ఉన్న సినీ పరిశ్రమల్లో కూడా నేను రోజు గమనిస్తూనే ఉన్నాను. ఆడవారిని, వారి శరీరాన్ని ఐటెం పాటకి ఉపయోగించే ఒక మాంసపు ముద్దగా చూస్తున్నారే తప్ప, వారికి సముచితమైన పాత్రలను ఇచ్చి వారికి పూర్తి అవకాశాలాను కల్పిస్తున్న వారు ఎంతమంది? లేడీ ఆర్టిస్ట్స్‌లో ఉన్న పూర్తి  నైపుణ్యాన్ని చూపించడానికి అవకాశం ఇచ్చేవారు ఎంతమంది? ఇంకా గట్టిగ్గా చెప్పాలి అంటే ఆడవారిని ఆడవారిగా చూపిస్తున్న వారు ఎంతమంది?
 
మలయాళ కళాకారిణిపై జరిగిన ఈ అకృత్యం సమాజంలో ఇదే మొదటిది కాదు, ఇదే చివరిది కాకపోవచ్చు. నిజానికి ఈ సంఘటన తరువాత సమాజంలో నేను కూడా ఎంతటి అభద్రతా భావంతో ఉన్నానో ఈ సందర్భంగా చెప్పదలచుకున్నాను. ఇప్పుడు సమాజంలో స్త్రీ ఏ సంఘటనల వల్ల భయపడుతుందో అవి నేటి సమాజంలో చాలా సర్వ సాధారణం అయిపోయాయి. అయితే అవి సాధారణమైన విషయాలు కావు. అవి నిత్యకృత్యం కూడా కాకూడదు. ఇప్పటి సమాజంలో స్త్రీలం రోడ్డు మీద ఒంటరిగా నడవటానికి భయపడుతున్నాం, బస్‌ల్లో "నిర్భయ"ముగా ఇంటికి వెళ్ళడానికి బయపడుతున్నాం, రోడ్డు మీద నలుగురు మగవారు గుంపుగా ఉన్నప్పుడు భయపడుతున్నాం, మాకు నచ్చిన బట్టలు మాకు నచ్చినట్టు వేసుకోవడానికి భయపడుతున్నాం, మొత్తంగా మా ఉనికినే భయపడుతూ కొనసాగిస్తున్నాం.
 
వీటన్నిటిని పరిగణంలోకి తీసుకొని చెప్పాలంటే స్త్రీలమైన మాకు ఈ సమాజంలో నిజంగా రక్షణ లేదు అనే చెప్పాలి. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? ఆడవారిని చీకటి పడ్డ తరువాత మూసిన తలుపు చాటే బతకమని చెప్పడం? స్మోక్ చేయవద్దు అని చెప్పడం? డ్రింక్ చేయవద్దు అని చెప్పడం? గట్టిగా నవ్వొద్దు అని చెప్పడం? హద్దులు దాటొద్దు అని చెప్పడం? ఇవేవి దీనికి పరిష్కార మార్గాలు కావు, ముందు మన మగ బిడ్డలకి.. ఆడవారిని, వారి శరీరాలని గౌరవించడం నేర్పించండి, ఆడపిల్లలకి వారి గౌరవాన్ని పొందటం వారి హక్కుగా భావించడం నేర్పండి. స్త్రీలకి సమాజంలో జరిగే తప్పుఒప్పులకు అనుగుణంగా గొంతు ఎత్తి ప్రశ్నించడం నేర్పించండి. రేపటి వారి నిర్భయమైన భవిష్యత్ కోసం నేడు ధైర్యంగా అడుగులు వేయడం నేర్పించండి.
 
ప్రేమతో
మీ మంచు లక్ష్మి.