మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (13:40 IST)

మమ్మిల్ని వదిలేసి వెళ్లిపోయావా మిత్రమా!! జేపీ మృతిపై చిరంజీవి సంతాపం

ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన సంతాప సందేశాన్ని ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. జేపీ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్యానించారు. 
 
ఆయనతో కలిసి తాను చివరిసారిగా 'ఖైదీ నెంబర్ 150'లో నటించానని తెలిపారు. గొప్ప నటుడని కితాబిచ్చారు. తన కన్నతల్లి నాటరంగం, తనను పెంచిన తల్లి సినీరంగం అని జయప్రకాశ్ రెడ్డి అంటుండేవారని చెప్పారు. నాటకరంగంపై ఆయనకు ఎంతో ప్రేమ అని అన్నారు.
 
ఇకపోతే, 'శని, ఆదివారాల్లో షూటింగులు పెట్టుకోనండి... స్టేజ్ మీద పర్ఫామెన్స్ ఇస్తుంటాను... మీరు ఎప్పుడైనా రావాలి' అని తనను అడిగేవారని చిరంజీవి గుర్తుచేశారు. అయితే ఆయన స్టేజ్ ప్రదర్శనను చూసే అవకాశాన్ని తాను పొందలేకపోయానని తెలిపారు. 
 
రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పాత్ర అనగానే మొదట గుర్తుకొచ్చేది జయప్రకాశ్ రెడ్డి అని అన్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్‌ను సృష్టించుకున్నారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

ఇకపోతే, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా తన ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. విలన్ నుంచి కమెడియన్ వరకు అద్భుతంగా నటించిన వ్యక్తి జయప్రకాష్ అని గుర్తుచేశారు. అలాగే, హీరో బాలకృష్ణ కూడా సంతాపం తెలుపుతూ 
ట్వీట్ చేశారు.
 
అలాగే, ప్రముఖ హాస్య నటుడు అలీ కూడా తన సంతాప సందేశాన్ని వ్యక్తం చేశారు. జయప్రకాష్ రెడ్డి కోరిన ఆ చివరి కోరికను తాను తీర్చలేకపోయానని, అందుకు ఆయన సారీ చెబుతున్నట్టు పేర్కొన్నారు.