'సిరివెన్నెల' సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించింది : ఇళయరాజా
తెలుగు సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంపై సంగీత మేథావి ఇళయరాజా స్పందించారు. సిరివెన్నెల మృతిపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతికలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన ఇంత త్వరగా శివైఖ్యం చెందడం చాలా బాధగా ఉందన్నారు. సిరివెన్నెల జీవించినంత కాలం పాట కోసం జీవించారని, బతికినంత కాలం పాటలే రాశారని, ఆయనకు ఈశ్వరుడు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే అంశంపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
వేటూరి సుందరరామమూర్తి అసిస్టెంట్‌గా చేరిన సిరివెన్నెల అనతి కాలంలోనే శిఖర స్థాయికి చేరుకున్నారని కొనియాడారు. తమ ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు జీవం పోసుకున్నాయన్నారు. సిరివెన్నెల పాటల పదముద్రలు తన హార్మొనియం మెట్లపై నాట్యం చేశాయని అన్నారు. సినిమా పాటల్లో సైతం కవితాత్మని, కళాత్మకతని అందించి తనదైన ముద్రతతో అర్థవంతమైన పాటలు అందించారన్నారు.
ముఖ్యంగా, సిరివెన్నెల సాహిత్యం తనతో ఆనంద తాండవం చేయించిందని ఇళయరాజా అన్నారు. వేటూరు తనకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే సీతారామశాస్త్రి తనకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచారని ఇళయరాజా కొనియాడారు.