బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (14:56 IST)

ప్రాణ స్నేహితుని కోసం మోక్ష జ్యోతిని వెలిగించిన సంగీత స్రష్ట!!

భారతీయ సినీ రంగంలో సంగీత దర్శకుడు ఇళయరాజా, నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిద్దరూ ప్రాణస్నేహితులు. వీరిద్దరినీ సంగీతమే ఒకటిగా చేసింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా వారు ప్రాణస్నేహితుల్లా కలిసిమెలిసివున్నారు. 
 
ఇటీవల పొరపొచ్చాలు వచ్చినా టీకప్పులో తుఫానులా అది వెంటనే సమసిపోయింది. ఎస్పీ బాలు కరోనా బారినపడినప్పుడు ఇళయరాజా తల్లడిల్లిపోయారు. బాలు ఇక లేరన్న వార్త తెలియగానే ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ తన ఆప్తమిత్రుడి కోసం మౌనంగా రోదించారు. ఎస్పీ బాలు అంత్యక్రియలు శనివారం ముగిశాయి.
 
ఈ నేపథ్యంలో, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో బాలు కోసం ఇళయరాజా మోక్ష జ్యోతిని వెలిగించారు. తమకు అత్యంత ప్రియమైన వ్యక్తులు చనిపోయినప్పుడు వారికి సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటూ తిరువణ్ణామలై క్షేత్రంలో దీపం వెలిగించడం పరిపాటి.
 
ఇళయరాజా గతంలో సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కోసం ఇలాగే దీపం వెలిగించారు. ఇటీవలే తన సంగీత బృందంలో సుదీర్ఘకాలం పనిచేసిన ఓ కళాకారుడి కోసం కూడా రాజా దీపం పెట్టారు. ఇప్పుడు తన ఆరోప్రాణం వంటి ఎస్పీ బాలు కోసం బరువెక్కిన హృదయంతో మోక్ష జ్యోతిని వెలిగించారు. ఆయనకు మోక్షం ప్రాప్తించాలంటూ ఆ అరుణాచలేశ్వరుడిని ప్రార్థించారు.