నాగచైతన్య కారు బ్లాక్ ఫిలిం తొలగింపు-రూ.700ల జరిమానా
హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులకు హీరో నాగచైతన్య చిక్కాడు. జూబ్లీ హిల్స్‌లో చైతూ కారుకి ఉన్న బ్లాక్ ఫిలింలను గుర్తించి ఆ కారుని ఆపి ట్రాఫిక్ పోలీసులు 700 రూపాయలు జరిమానా విధించారు. కారుకి ఉన్న బ్లాక్ ఫిలింలని కూడా తొలగించారు. ఆ సమయంలో నాగ చైతన్య కారులోనే ఉన్నారు.
ఇకపోతే.. ఇటీవల వై కేటగిరి వరకు భద్రత ఉన్న వ్యక్తులు తప్ప ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు వీటిపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు.
కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులను ఆపి మరీ జరిమానాలు విధిస్తూ, అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింలను తొలగిస్తున్నారు పోలీసులు.
ఇప్పటికే హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే సోదాల్లో చాలా మంది సెలబ్రిటీలు, స్టార్లు పట్టుబడుతున్నారు.
ఈ క్రమంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్, త్రివిక్రమ్.. లాంటి పలువురి కార్లను ఆపి వారి కార్లకి ఉన్న బ్లాక్ ఫిలింలని తొలగించి జరిమానాలు విధించారు పోలీసులు.