గురువారం, 6 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మార్చి 2025 (09:18 IST)

ప్లీజ్ అలా పిలవొద్దంటున్న అగ్ర హీరోయిన్!!

nayanathara
దక్షిణ భారత చిత్రపరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. తనను లేడీ సూపర్ స్టార్ అంటూ పిలవొద్దని మంగళవారం రాత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. తనను లేడీ  సూపర్ స్టార్ అని పిలవొద్దని, అభిమానులు ఎంతో ప్రేమతో అలా పిలవడం ఆనందంగా ఉన్నప్పటికీ నయనతార అనే పేరే హృదయానికి హత్తుకుని ఉంటుందని తెలిపారు. ఆ పేరు నటిగానే కాకుండా వ్యక్తిగా కూడా తనేంటో తెలియజేస్తుందని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
అభిమానులు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞురాలినంటూ పేర్కొన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తన విజయంలో, కష్టసమయంలో అభిమానులు అండగా ఉన్నారని గుర్తుచేశారు. ప్రేమతో ఇచ్చిన లేడీ సూపర్ స్టార్ బిరుదుకు తాను రుణపడి ఉంటానని, కానీ నయనతార అని పిలిస్తేనే తనకు ఆనందంగా ఉంటుందని చెప్పారు. లేడీ సూపర్ స్టార్ వంటి బిరుదులు వెలకట్టలేనివని, అయితే, వాటి వల్ల సౌకర్యంగా ఉండలేని పరిస్థితి కూడా ఉందని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.