శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (09:52 IST)

పవన్ మంచి మనస్సున్న మనిషి... నటన భగవంతుడిచ్చిన వరం...

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకోవడంపై పలువురు సినీ సెలెబ్రిటీలు స్వాగతిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఒకరు. పరుచూరి పలుకులు అనే పేరుతో తన అభిప్రాయాన్ని వీడియో ద్వారా పోస్ట్ చేశారు. పవన్ మంచి మనస్సున్న మనిషి అని చెప్పారు. పైగా, నటన భగవంతుడిచ్చినవరం అంటూ వ్యాఖ్యానించారు. 
 
రాజకీయాల్లోకి వెళ్లినంత మాత్రాన తిరిగి సినిమాల్లో నటించకూడదన్న నియమేమీ లేదన్నారు. పలువురు సినీ నటులు రాజకీయాల్లో ఉంటూనే నటించారనీ, నటిస్తున్నారనీ గుర్తుచేశారు. పవన్ తిరిగి సినిమాల్లోకి రావడం చాలా మందికి ఇష్టమేనని చెప్పుకొచ్చారు. 
 
ముఖ్యంగా నటన అనేది ప్రతి ఒక్కరికీ అబ్బేది కాదన్నారు. నటన కొంతమందికి దేవుడిచ్చినవరం. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాం. సమాజంలో జరుగుతున్న అంశాలను తెరపై చూపిస్తుంటే అవి నచ్చి మమ్మల్ని ప్రేమిస్తున్నారు. నటులు ధరించే పాత్రలతో వారికి ఆ ఇమేజ్ వస్తుంది. కొందరినైతే ఆరాధిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. 
 
గతంలో స్వర్గీయ ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటించారని గుర్తుచేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత 94లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడానికి 'మేజర్ చంద్రకాంత్' చిత్రం ఎంతగా ఉపయోగపడిందో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. 
 
అలాగే, ఎంజీఆర్ కూడా తాను ఎమ్మెల్యేగా గెలిచినా సినిమాలు మానేయలేదు. రేపు పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినా నటిస్తూనే ఉండాలి. పవన్ మంచి మనస్సున్న మనిషి. మంచి ఇమేజ్ ఆయన సొంతం అని చెప్పుకొచ్చారు. 
 
అలాంటి పవన్‌కు ఇపుడు నేను చెప్పేది ఒక్కటే. మీరు వీధి వీధి తిరిగి చెప్పేకంటే ఒక్క మీడియా ద్వారా, పాత్ర ద్వారా మీ మాటలు అద్భుతంగా ప్రజల్లోకి వెళ్లిపోతాయి. కర్తవ్యం చూసి చాలామంది మహిళలు పోలీస్ అధికారులు కావాలనుకున్నారు. సినిమా ప్రభావం అలాంటిదని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. 
 
కాగా, పవన్ కళ్యాణ్ "పింక్" రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం అజ్ఞాతవాసి తర్వాత తొలిసారి మేకప్ వేసుకున్నారు. అలాగే, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ చిత్రాల్లో నటించేందుకు సమ్మతించారు.