శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జులై 2020 (13:41 IST)

నవరస నటనా శిఖరానికి సరైన గుర్తింపు దక్కలేదు : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్ర పరిశ్రమలో నవరస నటనా సార్వభౌముడిగా పేరుగాంచిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ. ఈయన తన పుట్టిన రోజును జూలై 25వ తేదీన జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 
 
ఈ ట్వీట్‌లో నవరసాలను అలవోకగా పండించగల కైకాల సత్యనారాయణ తెలుగునేలపై జన్మించడం తెలుగువారి అదృష్టమని కొనియాడారు. తెలుగు చిత్రపరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ రావడంలో ఆయన కృషి ఎంతో ఉందని గుర్తుచేశారు. 
 
మద్రాసు నగరంలో ఉన్నప్పటి నుంచే సత్యనారాయణతో తమ కుటుంబానికి అనుబంధం ఉందని, ఎప్పుడు కలిసినా ఎంతో వాత్సల్యంతో మాట్లాడేవారని పవన్ గుర్తు చేసుకున్నారు. సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి అనేకమంది కళాకారులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. 
 
అయితే, నాటక, సినీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయనకు ప్రభుత్వపరంగా ఎలాంటి గుర్తింపు రానందుకు ఎంతో బాధగా ఉందని, తానేకాకుండా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా ఈ విషయంలో విచారం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కైకాల సత్యనారాయణకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, 1935 సంపత్సరం జూలై 25వ తేదీన కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున పార్లమెంట్ సభ్యుడుగా కూడా ఉన్నారు. 2011లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2017లో ఫిల్మ్ ఫేర్ అవార్డు, 59వ జాతీయ అవార్డును అందుకున్నారు. 
 
1959లో సిపాయి కూతురు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన కైకాల... చివరిగా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో హీరోయిన్ పూజాకు తాతగా కనిపించారు. ఈయన అడవి రాముడు, బంగారు కుటుంబం వంటి చిత్రాలను నిర్మించగా, కేజీఎఫ్-1 చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మంచి లాభాలను తెచ్చిపెట్టిన విషయం తెల్సిందే.