1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 17 జూన్ 2024 (12:03 IST)

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

Shyam Selvan clap by Ponnam Prabhakar
Shyam Selvan clap by Ponnam Prabhakar
ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు 'శ్యామ్ సెల్వన్'ను హీరోగా పరిచయం చేస్తూ, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "నిమ్మకూరు మాస్టారు". జె.ఎమ్.సినీ ఫ్యాక్టరీ పతాకంపై యువ నిర్మాత జె.ఎమ్.ప్రదీప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి "అముదేశ్వర్" దర్శకుడు. మాధవపెద్ది సురేష్ చంద్ర సంగీత సారధ్యం చేస్తుండగా,  కవి, గీత రచయిత జొన్నవిత్తుల సాహిత్యం సమకూరుస్తున్నారు. 
 
Jonnavitula, Shyam Selvan, Madhavapedi Suresh and others
Jonnavitula, Shyam Selvan, Madhavapedi Suresh and others
ఈ చిత్రం ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరిగింది. రాజేంద్ర ప్రసాద్ సహా యూనిట్ సభ్యులందరూ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్.. హీరో శ్యామ్ సెల్వన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 
 
అనంతరం సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ చంద్ర, గీత రచయిత జొన్నవిత్తుల, చిత్ర కథానాయకుడు శ్యామ్ సెల్వన్, నిర్మాత జె.ఎమ్.ప్రదీప్, దర్శకుడు అముదేశ్వర్ పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు. 
 
తమ కుటుంబం నుంచి ఐదో తరం వాడైన తన మనవడు శ్యామ్ సెల్వన్ హీరోగా పరిచయం అవుతుండడం గర్వంగా ఉందన్నారు మాధవపెద్ది సురేష్ చంద్ర. ఒక గొప్ప ఉదాత్తమైన కథాంశంతో రూపొందుతున్న రూపొందుతున్న "నిమ్మకూరు మాస్టారు" జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఈ చిత్రంలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉందని పేర్కొన్న జొన్నవిత్తుల... ఇందులో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయని, ముఖ్యంగా ఒక పాట చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రకటించారు. మాధవపెద్ది ఇప్పటివరకు చేసిన సినిమాలు, కూర్చిన పాటలు ఒకెత్తు... మనవడి పరిచయ చిత్రమైన "నిమ్మకూరు మాస్టారు" ఒకెత్తు కానుందని జొన్నవిత్తుల అన్నారు. 
 
రాజేంద్ర ప్రసాద్ వంటి లెజెండ్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుండడం ఎంతో ఉద్వేగంగా ఉందని హీరో శ్యామ్ సెల్వన్ అన్నారు. మాధవపెద్ది, జొన్నవిత్తుల, రాజేంద్ర ప్రసాద్ వంటి లెజెండ్స్ తో "నిమ్మకూరు మాస్టారు" వంటి గొప్ప చిత్రాన్ని నిర్మించే అవకాశం లభించడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నానని నిర్మాత జె.ఎమ్.ప్రదీప్ పేర్కొన్నారు. తమిళంలో శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రభు - కమల్ హాసన్ లతో ఓ సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన తనకు... "నిమ్మకూరు మాస్టారు" వంటి చిత్రంతో తెలుగులో ప్రవేశించే అవకాశం లభించడం గర్వంగా ఉందని అముదేశ్వర్ తెలిపారు, ఈనెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని, రాజమండ్రిలో ఒక షెడ్యూల్ చేస్తున్నామని వివరించారు. 
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: ఎ.డి.కరుణ్, ఆర్ట్: మురళి, ఎడిటర్: ఎ.ఆర్.శివరాజ్, స్టిల్స్: పాండ్యన్, పబ్లిసిటీ డిజైన్స్; కృష్ణ ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: చంద్రమోహన్, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కో-డైరెక్టర్స్: జె.సి.రవికుమార్ - దార్ల నాని, అసోసియేట్ డైరెక్టర్: సూర్య రేపాల, అసిస్టెంట్ డైరెక్టర్: మద్ధులచెరువు దీపక్, సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం; మాధవపెద్ది సురేష్ చంద్ర, నిర్మాత: జె.ఎమ్.ప్రదీప్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అముదేశ్వర్!!