సరిలేరు నీకెవ్వరులో ఆ పాత్ర ఇష్టం లేకే చేశాను.. ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తాను చేసిన పాత్రల్లో తనకి నచ్చని ఒక పాత్రను గురించి తాజా ఇంటర్యూలో ప్రస్తావించారు. ముఖ్యంగా "సరిలేరు నీకెవ్వరు" సినిమాను గురించి ఆయన ప్రస్తావించడం విశేషం. ఈ సినిమాలో ఆయన "ఎద్దుల నాగేంద్ర" పాత్రలో రాజకీయనాయకుడిగా కనిపిస్తారు.
దాని గురించి ఆయన మాట్లాడుతూ .. "ఏదైనా ఒక పాత్రను ఇష్టపడి చేయాలి .. ఆసక్తితో చేయాలి .. ఉత్సాహంతో చేయాలి. అలా లేని పాత్రలో ఇన్వాల్వ్ కాలేము. మొదటి నుంచి కూడా నాకు మూస పాత్రలు చేయడం ఇష్టం ఉండదు. కానీ కొన్ని సార్లు నా ఇష్టానికి వ్యతిరేకంగా చేసిన పాత్రలు ఉన్నాయి. అలా "సరిలేరు నీకెవ్వరు" సినిమాలోను చేయవలసి వచ్చింది.
ఆ పాత్ర నాకు నచ్చకపోయినా .. చేయక తప్పలేదు. కొన్నిసార్లు మన ఆలోచనలకు .. అభిప్రాయాలకు అవకాశం ఉండదు. ఆ పాత్రను చేయడం నాకు చాలా అసంతృప్తిని కలిగించింది.
మహేశ్ బాబు హీరోగా చేసిన ఆ సినిమాలో ఆ పాత్ర నేను ఇబ్బంది పడుతూ చేశాను. కానీ ఆయన నిర్మించిన "మేజర్" సినిమాలోని పాత్రను ఇష్టపడి చేశాను. అందువలన బ్యాలెన్స్ అయిందనే అనుకుంటున్నాను.. అంటూ ప్రకాష్ రాజ్ చెప్పారు.