డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనపై తెలుగు చిత్రపరిశ్రమ స్పందించింది. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు తాము కట్టుబడివున్నామని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శులు కేఎల్ దామోదర ప్రసాద్, కె.శివప్రసాద రావులు తెలిపారు. ఈ మేరకు వారు గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టే విషయంలో తమ వంతు బాధ్యతగా చలన చిత్ర పరిశ్రమ, ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు.
'ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలపై సానుకూలంగా స్పందించారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై సినీ రంగ ప్రముఖలు, సినిమా థియేటర్ యాజమాన్యాలు తమ వంతుగా కృషి చేయాలన్నారు.
ఇలాంటి విషయాల్లో గతంలోనూ చిత్ర పరిశ్రమ ముందుండి ప్రభుత్వానికి అండగా నిలబడింది. చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యాలు.. డ్రగ్స్, సైబర్ నేరాలు అరికట్టే విషయంలో తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తాయి. ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తాం' అని పేర్కొన్నారు.